నీరు సమృద్ధిగా లభించిన చోట వ్యవసాయం, పరిశ్రమలు అన్ని రంగాలు కళకళలాడుతాయని... ఆ నీరే లేకపోతే అన్నీ వెలవెల పోతాయని మంత్రి హరీశ్ రావు తెలిపారు. నీటి ప్రాధాన్యత అందరికన్నా తెలంగాణకే ఎక్కువ తెలుసని... చెరువులు ధ్వంసమై పోయి, బావులు, బోర్లు ఎండిపోయి, భూగర్భ జలాలు అడుగంటి అష్టకష్టాలు అనుభవించిందని గుర్తుచేశారు. రాష్ట్ర వార్షిక పద్దును శాసనసభలో ప్రవేశపెట్టి సాగునీటి రంగానికి రూ.16,931 కోట్లు కేటాయించారు.
గత పాలకుల నిర్వాకమే..
గత పాలకులు అంతరాష్ట్ర వివాదాలకు ఆస్కారం కలిగించే విధంగా ప్రాజెక్టులకు రూపకల్పన చేశారని... అంతేకాకుండా రిజర్వాయర్ల నీటి సామర్థ్యాలను తగ్గించారని వ్యాఖ్యానించారు. గోదావరినదిపై కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపు పూర్తయిందని... సీతారామ ప్రాజెక్టు పూర్తి కావొస్తోందని... పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.
కాళేశ్వరం అపురూప ఘట్టం..
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం రాష్ట్ర చరిత్రలో ఓ అపురూప ఘట్టమని.. మేడిగడ్డ వద్ద సముద్రమట్టానికి వందమీటర్ల ఎత్తులో ప్రవహించే గోదావరి నీటిని, 618 మీటర్ల ఎత్తున ఉన్న కొండ పోచమ్మ సాగర్లోకి తీసుకొచ్చిన అద్భుతమైన సన్నివేశానికి మనమంతా సాక్షులుగా నిలిచామన్నారు. రంగనాయక్ సాగర్, కొండపోచమ్మ సాగర్లను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేశామన్నారు. ఈ రిజర్వాయర్ల ద్వారా ప్రస్తుత యాసంగి పంటకు రైతులకు నీరందించి వారి హృదయాల్లో సంతోషాన్ని నింపామని వెల్లడించారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా సాగు నీటి అవసరాల కోసం తలపెట్టి డిండి ఎత్తిపోతల పథకం పనులు వేగంగా జరుగుతున్నాయని. త్వరలోనే ప్రాజెక్టు పూర్తి అవుతుందని స్పష్టం చేశారు. దేవాదుల ప్రాజెక్టులో భాగమయిన సమ్మక్క సాగర్ దాదాపు పూర్తయ్యిందని... సీతారామ ప్రాజెక్టులో భాగమయిన సీతమ్మసాగర్ బ్యారేజీ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు.
పూర్తైన కొత్త లిఫ్టులు
- నాగార్జున సాగర్ నియోజకవర్గంలో నెల్లికల్
- దేవకొండ నియోజకవర్గంలో పోగిల్ల, కంబాలపల్లి, నంబాపురం-పెద్దగట్టు, పెద్దమునిగాల, అక్కంపల్లి
- మిర్యాలగూడ నియోజకవర్గంలో దున్నపోతుల గండి-బాల్నేపల్లి, బాప్లాతండా, కేశవపురం-కొండ్రాపోల్, బొత్తలపాలెం-వాడపల్లి, వీర్లపాలెం, తోపుచర్ల
- హుజూర్నగర్ నియోజకవర్గంలో ఎంబీసీ-ముక్త్యాల బ్రాంచి కెనాల్, జాన్పాడ్
- జుక్కుల్ నియోజకవర్గంలో నాగ మడుగు
- బాన్సువాడ నియోజకవర్గంలో జకోరా, చందూర్
- ఆర్మూరు నియోజకవర్గంలో ముచ్చర్ల, కంమ్టం-చిక్లీ
- బాల్గొండ నియోజకవర్గంలో చిట్టాపూర్
- ధర్మపురి నియోజకవర్గంలో స్తంభం పల్లి, వెల్గటూరు, దమ్మనపేట
- ముథోల్ నియోజకవర్గంలో పిప్రి
- గద్వాల నియోజకవర్గంలో గట్టు
- దుబ్బాక నియోజకవర్గంలో ఎల్లారెడ్డిపేట