Minister Gangula Talks With Ration Dealers Success : చౌక ధరల దుకాణాల డీలర్ల సంఘాల సంఘం ప్రతినిధులతో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. జూన్ 5 నుంచి రేషన్ డీలర్లు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో రేషన్ డీలర్ల ఐకాస ప్రతినిధులతో మంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, పద్మాదేవేందర్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్‌కుమార్, ఐకాస ఛైర్మన్ నాయికోటి రాజు, ఉపాధ్యక్షుడు బంతుల రమేశ్‌బాబు, కన్వీనర్ దుమ్మాటి రవీందర్, కో కన్వీనర్ గడ్డం మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో డీలర్ల సంఘం ఇచ్చిన 22 డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించారు. మొత్తం 22 అంశాలు ప్రభుత్వం ముందు ఉంచగా.. 20 సమస్యల పరిష్కారానికి మంత్రి గంగుల కమలాకర్ సానుకూలంగా స్పందించారు.
ఆ రెండు సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తా!: ఇందుకు సంబంధించి వారం రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామని మంత్రి వారికి హామీ ఇవ్వడంతో చౌక ధరల దుకాణాల డీలర్ల సంఘాల ఐకాస మెత్తబడింది. సుధీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రేషన్ డీలర్లకు గౌరవ వేతనం, కమీషన్ పెంపు ఈ రెండు సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి గంగుల కమలాకర్ హామీ ఇచ్చారు. పేద ప్రజలకు నిత్యావసర సరుకులను సకాలంలో అందించాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.