Gangula kamalakar about BC caste communities : బీసీ కులాల మధ్య ఐఖ్యత ఉంటే... భవిష్యత్తులో ఆర్థికంగా సామాజికంగా మరింత ముందుకు వెళ్తామని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో జరిగిన బీసీ కులాల ఆత్మగౌరవ భవనాలు - రాష్ట్ర స్థాయి రిజిస్టర్డ్ కుల సంఘాల నాయకుల సమావేశంలో మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఏక సంఘంగా ఏర్పడిన 14 బీసీ కులాల నాయకులకు మంత్రుల చేతుల మీదుగా ఆత్మగౌరవ స్థలాలు, భవనాల అనుమతి పత్రాలు అందజేశారు.
సీఎం కేసీఆర్ దూరదృష్టితోనే...
బీసీ కులాలకు భూములు ఇవ్వడమే కాదు ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కూడా ప్రభుత్వమే చేపడుతుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇవాళ 41 కులాల్లో 14 కులాలకు భూమి పట్టాలు అందజేశామని... మిగతా కుల సంఘాలు కూడా ఐఖ్యంగా ముందుకు వస్తే భూములు ఇస్తామని ప్రకటించారు. మార్చి మొదటి వారంలో ఆ భూముల్లో ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి శంఖుస్థాపన చేస్తామని గంగుల వెల్లడించారు. కుల, చేతి వృత్తులకు పునరుత్తేజం తీసుకొచ్చి... గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం ప్రయత్నం చేస్తుంటే... చేపలు, గొర్రెలు ఇస్తారా అంటూ భాజపా నాయకులు వెటకారంగా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. బీసీ కులాల ఐఖ్యత దెబ్బతీసే శక్తులను ఉపేక్షించవద్దని... వెనుకబడిన కులాలకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ భరోసానిచ్చారు.
ఫిబ్రవరి చివరి నాటికి బీసీల్లోని కుల సంఘాలన్నీ ఏకతాటిపైకి రావాలి. మిగతా కుల సంఘాలు కూడా ఐఖ్యంగా ముందుకు వస్తే భూములు ఇస్తాం. మార్చి మొదటి వారంలో ఆ భూముల్లో ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి శంఖుస్థాపన చేస్తాం.
-గంగుల కమలాకర్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి
బీసీ కుల సంఘాలన్నీ ఏకతాటిపైకి రావాలి : గంగుల