GANGULA KAMALAKAR: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఖైరతాబాద్‌లోని కార్యాలయంలో పెట్రోల్, డీజిల్ సరఫరా, నిల్వలపై ఉన్నతాధికారులు, వివిధ కంపెనీల ఆయిల్ ప్రతినిధులతో మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సాధారణంగా ఉండాల్సిన నిల్వలు ఉన్న దృష్ట్యా నిరంతరాయంగా పెట్రోలు, డీజిల్ సరఫరా జరుగుతుందని తెలిపారు. అనవసరమైన పుకార్లు నమ్మవద్దని.. ప్రజలెవరూ ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని మంత్రి పేర్కొన్నారు.
ఎవరికి ఎంత కావాలంటే అంత పెట్రోల్, డీజిల్ వాహనాల్లో నింపుకోవచ్చని.. ఏమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. ఆర్టీసీ బస్సులు సైతం చిల్లర బంకుల నుంచే డీజిల్ పోయించుకుంటున్నాయని.. అందుకే బంకుల్లో త్వరగా నిల్వలు అయిపోతున్నాయని వివరించారు. పెట్రోలు, డీజిల్ సరఫరా, నిల్వలు, అమ్మకాలపై పౌరసరఫరాల శాఖ నిరంతరం పర్యవేక్షిస్తూ కొరత లేకుండా చూస్తుందన్నారు.
రాష్ట్రంలో మొత్తం అన్ని కంపెనీలవి కలిపి 3520 బంకులతోపాటు జీహెచ్ఎంసీ పరిధిలో 480 బంకుల్లో.. నిరంతరాయంగా పెట్రోల్, డీజిల్ సరఫరా కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. 807 ఎల్పీజీ ఔట్‌లెట్స్‌లో సైతం కావాల్సినంత నిల్వలు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం సాధారణంగా ఉండే విధంగా పెట్రోల్ 38,571 కిలో లీటర్లు, డీజిల్ 23,875 కిలో లీటర్లు ఉందని తెలిపారు.