gangula review on paddy procurement in yasangi season: దేశానికి అన్నం పెట్టే తెలంగాణ రాష్ట్రాన్ని.. కేంద్ర ప్రభుత్వం ఇతోధికంగా ప్రోత్సహించాలని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఈ ఏడాది త్వరలో ప్రారంభం కానున్న యాసంగి మార్కెటింగ్ సీజన్‌లో ధాన్యం సేకరణ కోసం ఏర్పాట్లు, అవసరమైన కొనుగోలు కేంద్రాల గుర్తింపు, గన్నీ సంచులు సమీకరణ, ప్యాడీ క్లీనర్లు, తేమ సాధనాలు, జియోట్యాగింగ్, రవాణా, మిల్లుల అనుసంధానం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా పౌరసరఫరాల శాఖ సంబందించి సేవలు పౌరులకు మరింత చేరువ చేసేందుకు ఐవీఆర్ఎస్ నెంబర్ 799712345ను మంత్రి గంగుల ప్రారంభించారు. ఈ సేవల ద్వారా కొత్త ఎఫ్‌ఎస్‌సీ కార్డుల సమస్యలు, పోర్టబులిటీ వీలు కలుగుతుంది. ఈ అప్లికేషన్ రూపకల్పనలో కృషి చేసిన ఎన్ఐసీ ఉద్యోగులను అభినందించి మెరిట్ సర్టిఫికెట్లు ప్రధానం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత వల్లే దేశానికి అన్నపూర్ణగా తెలంగాణ నిలిచిందని మంత్రి అన్నారు.
తెలంగాణ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకూ రైతుల వద్ద నుంచి 672 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం ద్వారా 1.21 లక్షల కోట్ల రూపాయలు నగదు చెల్లించామని తెలిపారు. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ సేకరణలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నామని చెప్పారు. ముఖ్యమంత్రి కృషి, రైతుబంధు, 24 గంటల ఉచిత కరెంటు సరఫరా సహా ఎంఎస్‌పీ కింద ధాన్యం సేకరణ తదితర రైతు అనుకూల విధానాలు దేశంలోనే వానా కాలం ధాన్యం సేకరణలో మొదటి స్థాయిలో నిలిపామని అన్నారు. అదే స్పూర్తి కొనసాగిస్తూ రాబోయే యాసంగి ధాన్యం సేకరణకు సమాయాత్తమవ్వాలని అధికారులకు సూచించారు.