తెలంగాణ

telangana

ETV Bharat / state

Paddy Procurement in Telangana: ధాన్యం కొనుగోళ్లపై ఆందోళన వద్దు : గంగుల - minister gangula review on paddy procurement

రాష్ట్రంలో ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లు చురుగ్గా సాగుతున్నాయని మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. కొనుగోళ్ల విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు. కొనుగోలు కేంద్రాలు, రవాణా సదుపాయాలు, గన్నీ బ్యాగులు అన్నీ సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ పరంగా చేసిన ఏర్పాట్లపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

minister gangula review on paddy procurement
ధాన్యం సేకరణపై మంత్రి గంగుల సమీక్ష

By

Published : Nov 1, 2021, 4:41 PM IST

రాష్ట్రంలో వానాకాలం ధాన్యం సేకరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 2021- 22 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయని ప్రకటించింది. హైదరాబాద్‌ ఖైరతాబాద్‌లోని తన కార్యాలయంలో వానా కాలం ధాన్యం కొనుగోళ్ల అంశంపై పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఖరీఫ్ సీజన్ ముగిసి పంట మార్కెట్‌కు వస్తున్న తరుణంలో పౌరసరఫరాల శాఖాపరంగా చేసిన ఏర్పాట్లను అధికారులు మంత్రికి వివరించారు. గన్నీ సంచుల అందుబాటు, రవాణా ఏర్పాట్లు, అకాల వర్షాల నుంచి ధాన్యం తడవకుండా టార్పాలిన్ల ఏర్పాటు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 1,033 కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని మంత్రి గంగుల అన్నారు. పంట కోతలు పూర్తైన ప్రాంతాల్లోనూ అవసరమైన చోట తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి జిల్లాల కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలను ఇచ్చామని తెలిపారు. ధాన్యం రాకకు సరిపడా గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని... దుష్ఫ్రచారాలను పట్టించుకోవద్దని మంత్రి సూచించారు. కొనుగోలు పూర్తైన తర్వాత తరలించడానికి రవాణా సదుపాయాలు కూడా పూర్తి సిద్ధంగా ఉన్న దృష్ట్యా రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ధాన్యం కొనుగోళ్లు సాఫీగా కొనసాగుతున్నాయని వివరించారు. పౌరసరఫరాల శాఖలో ఐటీ వింగ్ మరింత బలోపేతం చేసి శాఖాపరమైన అంశాలు నిరంతరం పర్యవేక్షిస్తామన్నాని తెలిపారు. ఇందుకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి గంగుల ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చదవండి:Pragathi Bhavan Muttadi: ప్రగతి భవన్ ముట్టడికి యూత్ కాంగ్రెస్ యత్నం.. ఉద్రిక్తం

ABOUT THE AUTHOR

...view details