తెలంగాణ

telangana

ETV Bharat / state

చట్టసభల్లో బీసీల రిజర్వేషన్లకు ఉద్యమించాలి: గంగుల - చట్టసభల్లో బీసీల రిజర్వేషన్లపై మహాదీక్ష

స్వాతంత్య్రం వచ్చి 74 ఏళ్లు దాటినా బీసీలకు ప్రాధాన్యత దక్కలేదని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ హైదరాబాద్‌ నారాయణగూడలో నిర్వహించిన మహాదీక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

minister gangula kamalakar participated bc reservations mahadeeksha in narayana guda in hyderabad today
బీసీల మహాదీక్షలో మాట్లాడుతున్న మంత్రి గంగుల కమలాకర్‌

By

Published : Feb 23, 2021, 7:38 PM IST

చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం కొనసాగించాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని నారాయణగూడలో బీసీ సంక్షేమసంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మహాదీక్షకు ఆయన హాజరయ్యారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖ లేకపోవడం దారుణమన్నారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు సాధనకు బీసీలందరూ సన్నద్ధం కావాలని మంత్రి పిలుపునిచ్చారు. సదస్సులో బీసీ సంక్షేమసంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య, తెదేపా అధ్యక్షుడు ఎల్‌.రమణ, కాంగ్రెస్‌ సీనియర్‌నేత వీహెచ్‌ పాల్గొన్నారు. బీసీల డిమాండ్ల పరిష్కారం కోసం దిల్లీలో దీక్ష చేపడితేనే కేంద్రం దిగివస్తుందని గంగుల అన్నారు.

మార్చి మొదటి వారంలో అన్ని కుల, ఉద్యోగ సంఘాలు, రాజకీయ నాయకులను ఐక్యం చేసి ఛలో దిల్లీ కార్యక్రమం చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ ఉద్యమంలో భాజపా ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్‌ పాల్గొనాలని మంత్రి కోరారు. కేంద్రం బీసీ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు.

బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి : ఆర్‌.కృష్ణయ్య

రాజ్యాధికారం వస్తేనే బీసీలు అభివృద్ధి చెందుతారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. పోరాటాలు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లుపై చర్చ జరిగేలా ఉద్యమం ముందుకు తీసుకెళ్లాలన్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కును పాలకులు కాలరాస్తున్నారని మండిపడ్డారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న పాలకులు.. బీసీలను చట్టసభల్లో అడుగుపెట్టనియ్యకుండా వివక్ష చూపుతున్నారని విమర్శించారు.

బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలి : ఎల్‌.రమణ

పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తెదేపా అధ్యక్షుడు ఎల్‌.రమణ డిమాండ్‌ చేశారు. కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన్నారు. లేనిపక్షంలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లి ఉద్యమిస్తామని పేర్కొన్నారు. బీసీల పట్ల పాలకుల వైఖరిని ఎండగడతామని ఎల్.రమణ హెచ్చరించారు.

ఇదీ చూడండి :'చిన్న పిల్లలతో ప్రయాణం చేసే తల్లులకు ఉపయుక్తం'

ABOUT THE AUTHOR

...view details