Minister Gangula Kamalakar on Paddy Procurement: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల సమాయత్తమయ్యామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. హైదరాబాద్ ఎర్రమంజిల్ పౌరసరఫరాల భవన్‌లో మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది యాసంగి మార్కెటింగ్ సీజన్ ధాన్యం కొనుగోలు వివాదం నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతుల నుంచి సేకరించేందుకు ఏర్పాట్లు చేశామని ప్రకటించారు. ధాన్యం సేకరణ నుంచి తప్పుకోవడమే కాకుండా రెండు మూడేళ్లల్లో భారత ఆహార సంస్థను కూడా ఎత్తేసే యోచనలో ఉన్న కేంద్రం.. రాష్ట్రం నుంచి యాసంగి ధాన్యం సేకరించేందుకు సుముఖత చూపలేదని ఆక్షేపించారు. రేపట్నుంచి క్రమంగా గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే అన్ని జిల్లా కలెక్టర్లు, జిల్లా పౌరసరఫరాల అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు.
కేసీఆర్ మానవతకు మారుపేరు..‘కేంద్రం మోసం చేయడంతో రైతులను ఆదుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కేసీఆర్ మానవతకు మారుపేరు అని మరోసారి నిరూపితమైంది. కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)కు ధాన్యం కొనుగోలు చేసే ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగేందుకు రైతులంతా సహకరించాలి. తెలంగాణ రాష్ట్రంలో పండించిన ధాన్యం మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి. ఇతర రాష్ట్రాల్లో పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకురాకుండా చర్యలు తీసుకున్నాం. ప్రతి గ్రామంలో రైతులు ఎంత వరి సాగు చేశారు, ఎంత ధాన్యం వస్తుందో అంచనా వేసి... డేటా రూపొందించి ఆధార్ కార్డుతో అనుసంధానం చేశాం. కొనుగోలు కేంద్రానికి రైతు వచ్చిన వెంటనే అతని ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ నమోదు చేసిన తర్వాతే కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుంది.' -గంగుల కమలాకర్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి
తక్కువ ధరలకు అమ్ముకోవద్దు.. ఏ ఒక్క రైతు కూడా తక్కువ ధరలకు తమ ధాన్యాన్ని అమ్ముకోవద్దని... కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి విక్రయించాలని సూచించారు. మెడలు వంచాం.. ధాన్యం కొనిపిస్తున్నామన్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. ఎవరు మెడలు వంచితే తాము రైతుబంధు, రైతుబీమా, 24 గంటల విద్యుత్ సరఫరా సహా కాళేశ్వరం జలాలు ఇచ్చామని ప్రశ్నించారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సీఎంల మెడలు వంచి రైతుబంధు ఇప్పించు... లేకపోతే పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించేందుకు ప్రధాని మోదీ మెడలు వంచాలని హితవు పలికారు.