Minister Gangula Kamalakar meeting with DMs in State: ఈ ఏడాది యాసంగి కొత్త పంట వచ్చేలోపు రైసు మిల్లులు, గోదాములు ఖాళీ కావాలని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సీఎంఆర్ డెలివరీ తొందరగా పూర్తి చేయాలని, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే పనుల్ని సహించబోమంటూ హెచ్చరించారు. హైదరాబాద్ పౌరసరఫరాల భవన్లో 33 జిల్లాల ఉన్నతాధికారులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగుల డైరీ ఆవిష్కరించిన అనంతరం హెల్త్ కార్డులు అందజేసారు.
ధాన్యం సేకరణ పెరిగింది: సీఎంఆర్ డెలివరీ త్వరగా పూర్తి చేసి.. రాబోయే కొత్త పంట వచ్చే సమయానికి రైస్ మిల్లులు, గోదాములను ఖాళీ చేయాలని మంత్రి గంగుల ఆదేశించారు. పౌరసరఫరాల శాఖ ప్రతి ఉద్యోగి నిరంతరం అప్రమత్తంగా ఉండి రైతులకు సేవలందించాలన్నారు. తెలంగాణ ధాన్యం సేకరణలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. గతంలో కంటే ప్రస్తుతం ధాన్యం సేకరణ పెరిగిందని గుర్తు చేశారు.
మిల్లర్లతో ఎలాంటి ఇబ్బంది రాకూడదు: రైతుల ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని ధాన్యం సేకరణకు అనుమతి ఇవ్వాలని కేంద్రంతో మాట్లాడతానన్నారు. త్వరలోనే రాబోయే యాసంగి ధాన్యం సేకరణకు కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు రైతులకు అందుబాటులో ఉంటూ ధాన్యం సేకరణ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని కోరారు. మిల్లర్లతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వ్యవహరించాలని ఉద్యోగులకు మంత్రి సూచించారు.