ధాన్యం సేకరణలో గోనె సంచుల కొరతను అధిగమించేందుకు వ్యూహాత్మక ప్రణాళికను రూపొందించామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. మిల్లులకు తెచ్చిన సంచులను తిరిగి కొనుగోలు కేంద్రాలకు తేవాలని నిర్ణయించామని వివరించారు. ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయని, కరోనా నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు.
4800 కొనుగోలు కేంద్రాలు
- ఇప్పటికి 4,800 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నాం. రబీలో 1.05 కోట్ల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. వచ్చే సీజను విత్తనాల కోసం, సొంత అవసరాల కోసం రైతులు కొంత నిల్వ చేసుకుంటారు. అవన్నీ పోను 75 లక్షల నుంచి 80 లక్షల మెట్రిక్ టన్నుల వరకు విక్రయానికి రావచ్చని అంచనా. కోటి మెట్రిక్ టన్నులు తెచ్చినా కొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక వెసులుబాటును కల్పించారు.
- ధాన్యం దిగుబడి పెరగటంతో సుమారు 20 కోట్ల గోనె సంచులు అవసరం. పశ్చిమ బెంగాల్‌లోని జూట్ మిల్లుల నుంచి సంచులు రావాలి. లాక్‌డౌన్‌తో వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం సుమారు 15 కోట్ల వరకు అందుబాటులో ఉంటాయి. మిగిలిన 5 కోట్ల విషయంలోనే ఇబ్బంది. దాన్ని అధిగమించేందుకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లుల్లో పోసి సంచులను తిరిగి కేంద్రాలకు తేవాలని నిర్ణయించాం. ఈ విధానంతో కొరతను అధిగమించాలన్నది వ్యూహం. ఇలాంటి ప్రయోగం చేయడం ఇదే మొదటిసారి.
కొనుగోలు కేంద్రాల మ్యాపింగ్