నూతన వైద్య విధానాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు శిక్షణ ఇవ్వాలని అధికారులకు మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్యశాఖపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఫ్లోరైడ్, మలేరియా, బోదకాలు లాంటి జబ్బులు ఏ ప్రాంతాల్లో ఎక్కువ వస్తున్నాయనే దానిపై మ్యాపింగ్ చేయాలని మంత్రి పేర్కొన్నారు. దానికి అనుగుణంగా ఆయా అసుపత్రుల్లో డాక్టర్లు మందులు ఉండేలా చూడాలన్నారు.
కంపెనీలకు తిప్పి పంపాం
అన్ని చోట్ల అందుబాటులో ఎన్ని మందులు ఉన్నాయి..? అవి ఎప్పుడు గడువు తీరిపోతాయి..? అనే వివరాలు కంప్యూటరీకరణ చేయాలన్నారు. ప్రతి మందుకు కచ్ఛితంగా లెక్క ఉండాలని స్పష్టం చేశారు. వైద్య చరిత్రలో మొదటి సారి గడువు ముగిసిన మందులను కంపెనీలకు తిప్పి పంపించి డబ్బులు వెనక్కి తీసుకున్నామని మంత్రి తెలిపారు. ప్రపంచంలో ఉన్న మంచి వైద్య విధానాలను తెలుసుకుని మన దగ్గర అమలు చేయాలని సూచించారు.
రెఫరల్ సిస్టమ్
మంచి హెల్త్ కేర్ సిస్టమ్‌లు ఏమున్నాయి..? వాటిని మన దగ్గర అమలు చేయడానికి ఉన్న ప్రతిబంధకాలు ఏంటి..? వాటిని ఏవిధంగా అధిగమించాలి అనే సమగ్ర కార్యాచరణ రూపొందించాలని మంత్రి ఆదేశించారు. మన నెట్వర్క్ ప్రైవేట్ హాస్పిటల్స్ కంటే పెద్దది. కాబట్టి రెఫరల్ సిస్టమ్‌ను మొదలు పెట్టండన్నారు. ఆశా వర్కర్స్ పేషంట్లను పెద్దాసుపత్రులకు పంపించే విధానం అమలు కావాలన్నారు.