ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ప్రతిపాదనల రూపకల్పనలో మారుమూల గ్రామాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. పీఎంజీఎస్‌వై ప్రతిపాదనలపై ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మూడో దశలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 2,427 కిలో మీటర్ల రహదార్లు మంజూరు చేసిందని... అన్ని గ్రామీణ ప్రాంతాలకు ఈ రోడ్లను కేటాయిస్తామని మంత్రి తెలిపారు.
'ప్రతి పల్లెకు రోడ్లను విస్తరింపజేస్తాం' - Minister Errabelli on PMGSY Roads
ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ప్రతిపాదనలపై ఉన్నతాధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామీణ ప్రాంతాలకు రోడ్లను విస్తరింపజేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా చేపట్టే ఈ రహదార్ల ప్రతిపాదనల తయారీ పక్కాగా ఉండాలని... ప్రతి ఆవాసానికీ రవాణా సౌకర్యం కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి స్పష్టం చేశారు. పీఎంజీఎస్‌వై మార్గదర్శకాలను ప్రజాప్రతినిధులకు వివరించి, ఆ మేరకు ప్రతిపాదనలు ఉండేలా చూడాలని సూచించారు. వీలైనంత త్వరగా ప్రతిపాదనలు పూర్తి చేసి రాష్ట్ర కార్యాలయానికి నివేదించాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణ తాగునీటి సరఫరా ఇంజినీరింగ్ విభాగాల్లోని ఇంజినీర్ల సర్వీసు నిబంధనలు, పదోన్నతుల అంశంపై ఏర్పాటైన కమిటీ త్వరగా ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి దయాకర్ రావు ఆదేశించారు.
ఇదీ చూడండి: రాజ్యాంగస్ఫూర్తికి పునరంకితం అవుదాం: కేసీఆర్