మిషన్ భగీరథ మంచినీటి సరఫరా పథకాన్ని ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా.. ప్రజావసరాలు తీరే విధంగా ఉండాలని గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని మిషన్ భగీరథ కార్యాలయం నుంచి రాష్ట్రంలోని వివిధ జిల్లా ఎస్సీ, ఈఈలతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఎండాకాలంలో కత్తెర కార్తె వచ్చిందని, ఈ నెల రోజుల పాటు ఎండలు తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున ఈ దశలోనే మంచినీటి వాడకం కూడా ఎక్కువగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. ఈ సమయంలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండి పని చేయాలని సూచించారు. ప్రతి రోజూ, ప్రతినిత్యం నిరంతరం మానిటరింగ్ చేయాలని.. మంచినీరు అందడంలేదన్న గ్రామం కానీ, గల్లీ కానీ లేకుండా జాగ్రత్త పడాలని మంత్రి.. అధికారులను ఆదేశించారు.