రాష్ట్రంలో నిర్వహించిన పల్లె ప్రగతి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం విజయవంతమైందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఎర్రబెల్లి అభినందనలతోపాటు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల ఒకటి నుంచి 8వ తేదీ వరుకు 7 ప్రాథామ్యాలుగా నిర్వహించిన ఈ కార్యక్రమం వల్ల పల్లెల్లో పచ్చదనం వెల్లివిరుస్తుందని మంత్రి పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశంతో పలు ప్రాంతాల్లో పర్యటించడంతోపాటుగా వీడియో,టెలీ కాన్ఫరెన్స్‌ల ద్వారా అధికారులను అప్రమత్తం చేసినట్లు మంత్రి తెలిపారు. పంచాయతీల్లో సమావేశాలు, గ్రామాల్లో పాదయాత్రలు, పారిశుద్ధ్యం, సురక్షిత మంచినీటి సరఫరా, దోమల నివారణ, ఇతర ప్రాంతాల పరిశుభ్రత, చెత్త సేకరణ వంటి పలు అంశాలపై పల్లె ప్రగతి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారని మంత్రి ఎర్రబెల్లి వివరించారు.
ఈ కరోనా సమయంలోనూ నియంత్రిత పద్ధతిలో భౌతిక దూరాన్ని పాటిస్తూ, మాస్కులు ధరించి 1,75,485 మంది ప్రజలు ఆయా సమావేశాల్లో పాల్గొన్నారని మంత్రి పేర్కొన్నారు. 12,752 గ్రామ పంచాయతీల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు కలిసి పాదయాత్రలు నిర్వహించి, సమస్యలు గుర్తించి నివారించారని తెలిపారు. మురుగునీటి కాలువలను 81.26శాతం శుభ్రపరిచారని... అలాగే సర్కారు తుమ్మ, పిచ్చి చెట్లను 76.54శాతం నివారించిందని చెప్పారు. 70.37 శాతం సానిటేషన్తోపాటు... 79.31శాతం మంచినీటి ట్యాంకులను క్లోరినేషన్ చేశామన్నారు. మంచినీటి సరఫరా చానెల్స్ని 78.84శాతం పరిశుభ్ర పరిచినట్లు తెలిపారు.
జూన్ 5వ తేదీన ఒక్క రోజే 88.16శాతం డ్రై డేని పాటించడం జరిగిందని ఎర్రబెల్లి తెలిపారు. 80.78శాతం గ్రామాల్లో ఫాగింగ్ చేయడం జరిగిందన్నారు. అంగన్ వాడీ కేంద్రాల్లో 81.21శాతం, ప్రాథమిక పాఠశాలల్లో 81.78శాతం, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 82.90శాతం, హై స్కూల్స్‌లో 80.62శాతం పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించామని మంత్రి వివరించారు.