పల్లె ప్రగతి అమల్లో మంచి పనితీరు కనబర్చిన గ్రామపంచాయతీల్లో సీసీ రహదార్ల కోసం 20 లక్షల రూపాయల చొప్పున ప్రత్యేక నిధులు ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. రానున్న ఆర్థిక సంవత్సరానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మిషన్ భగీరథ శాఖలకు సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలపై సంబంధిత అధికారులతో మంత్రి సమీక్షించారు.
సంక్షేమంలో తెలంగాణ దేశానికి ఆదర్శం:
ఆదాయాన్ని పెంచి పేదలకు పంచాలన్న తెరాస ప్రభుత్వ విధానంతో... సంక్షేమం విషయంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని ఎర్రబెల్లి అన్నారు. రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు అభివృద్ధి ప్రక్రియను ముఖ్యమంత్రి కేసీఆర్ కొనసాగిస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించిన మేరకు సాయం అందడం లేదని ఎర్రబెల్లి వాపోయారు.
ఉపాధి హామీ పథకానికి సంబంధించి రాష్ట్రానికి కేంద్రం నుంచి మెటీరియల్ కాంపౌండ్ కింద రావాల్సిన 250 కోట్ల రూపాయల కోసం కేంద్రానికి మరోమారు లేఖ రాయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఉపాధిహామీ పథకం తాజా ప్రతిపాదనల్లో వైకుంఠధామాలు, ఇంకుడుగుంతలు, సీసీ రహదార్లకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.