ఆసరా పింఛన్ల(Aasara Pension) కనీస వయస్సును 57 ఏళ్లకు తగ్గించినందున అర్హులైన లబ్ధిదారులకు మూడు రోజుల్లోగా పింఛన్లు అందించాలని అధికారులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(ERRABELLI DAYAKAR RAO) ఆదేశించారు. ఫించన్ల వయోపరిమితి తగ్గించిన నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు, ఇతర కార్యక్రమాలపై సంబంధిత ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా అర్హులను గుర్తించి, ప్రతి ఒక్కరికి మూడు రోజుల్లోగా పింఛన్లు మంజూరు చేయాలని స్పష్టం చేశారు. అర్హుల ఎంపిక పారదర్శకంగా జరగాలని సూచించారు.
చర్యలు తీసుకోవాలి
గ్రామ స్థాయి మొదలు రాష్ట్ర స్థాయి వరకు పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాలన్న మంత్రి... వర్షాభావ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో హరితహారంలో(HARITHAHARAM) నాటిన మొక్కలు పూర్తిగా బతికేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన పనులను ఎప్పటికప్పుడు సోషల్ ఆడిటింగ్ చేసి నిధులు సద్వినియోగం అయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈ విషయంలో మండల, జిల్లా స్థాయి అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేయాలని ఎర్రబెల్లి తెలిపారు.