తెలంగాణ

telangana

ETV Bharat / state

Errabelli responded on JPS issue : 'ఆ సమాచారం వాస్తవం కాదు.. వారిని చర్చలకు పిలవలేదు' - Telangana latest news

Errabelli responded to the fake news on JPS : జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం చర్చలకు పిలిచిందన్న ప్రచారం నిజం కాదని పంచాయతీరాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు స్పష్టం చేశారు. కార్యదర్శులు ఫోన్​లో తనకు సమస్యలు చెప్పుకున్నారని.. సమ్మె విరమించాలని తాను సూచించినట్లు తెలిపారు.

Errabelli
Errabelli

By

Published : May 11, 2023, 1:51 PM IST

Errabelli DayakarRao responded to the fake news on JPS : తమ ఉద్యోగాలను క్రమబద్దీకరించాలంటూ గత కొన్నిరోజులగా ధర్నా చేస్తున్న జేపీఎస్​లను.. ప్రభుత్వం చర్చలకు పిలిచిందన్న వార్త వాస్తవం కాదని పంచాయతీరాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు తెలిపారు. ప్రభుత్వం తరపున ఎవరూ.. జూనియర్ పంచాయతీ కార్యదర్శులను చర్చలకు పిలవలేదని పేర్కొన్నారు.

కార్యదర్శులు ఫోన్​లో తనకు సమస్యలు చెప్పుకున్నారన్న మంత్రి... సమ్మె విరమించాలని తాను సూచించినట్లు తెలిపారు. కానీ, ప్రభుత్వం చర్చలకు పిలిచిందని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని దయాకర్ రావు తెలిపారు. నిబంధనలు, ఒప్పందాలకు విరుద్ధంగా చేస్తున్న సమ్మెను వెంటనే విరమించాలని మరోమారు స్పష్టం చేశారు.

జేపీఎస్​లు సమ్మె చేయడం నిబంధనలకు, చట్టానికి విరుద్ధమని.. ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందానికి విరుద్ధమని పేర్కొన్నారు. సంఘాలు ఏర్పాటు చేయబోమని, సమ్మెలు చేయబోమని, ఎలాంటి డిమాండ్లకు దిగబోమని ప్రభుత్వానికి జేపీఎస్​లు బాండ్ రాసిచ్చినట్లు గుర్తు చేశారు. రాసిచ్చిన ఒప్పందాలను ఉల్లంఘిస్తున్న తీరు బాగా లేదని దయాకర్ రావు ఆక్షేపించారు.

మనసున్న మహారాజు ముఖ్యమంత్రి కేసీఆర్​కు జేపీఎస్​లపై మంచి అభిప్రాయం ఉందని, ఆ పేరు చెడగొట్టుకోవద్దని ఎర్రబెల్లి సూచించారు. ప్రభుత్వాన్ని శాసించాలని సాహసించడం, నియంత్రించాలని అనుకోవడం తప్పని అన్నారు. జేపీఎస్​లు సమ్మె విరమిస్తే... ముఖ్యమంత్రి తప్పకుండా సాయం చేస్తారన్న నమ్మకం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇప్పటికైనా వెంటనే సమ్మెను విరమించి విధుల్లో చేరాలని జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు పిలుపునిచ్చారు.

ప్రభుత్వం నోటీసులు.. సమ్మె చేస్తోన్న 9వేల 350 మంది జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు.. మే తొమ్మిదో తారీఖు మంగళవారం సాయంత్రం 5 గంటలలోపు విధుల్లో చేరాలని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నోటీసులు జారీ చేసింది. లేని పక్షంలో ఉద్యోగాల నుంచి తొలగిస్తామని స్పష్టం చేసింది. అయినప్పటికీ నోటీసులను ఖాతరు చేయకుండా జేపీఎస్​లు సమ్మె చేస్తున్నారు.

రేవంత్​రెడ్డి కేసీఆర్​కు లేఖ..: పంచాయతీ సెక్రటరీలను రెగ్యులరైజ్‌ చేయాలని కోరుతు పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి సీఎం కేసీఆర్​కు లేఖ రాశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి బానిసల కంటే దారుణంగా తయారైందని విమర్శించారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు 79 అవార్డులు జూనియర్ కార్యదర్శుల కష్టంతోనే వచ్చాయని రేవంత్​రెడ్డి గుర్తు చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details