రాజకీయాల్లో సీనియర్ నాయకుడిగా ఉన్న జానారెడ్డి.. మిషన్ భగీరథ పథకంపై శుక్రవారం ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలో గడిచిన మూడేళ్ల నుంచి ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీళ్లు ఇస్తున్నామని చెప్పారు. జానారెడ్డి ఇంటికీ అందిస్తున్నామని.. సీనియర్ నాయకులుగా ఉండి అలా మాట్లాడటం తనకు బాధగా ఉందని వెల్లడించారు. రోడ్డు నిర్మాణం కారణంగా పట్టణంలో జానారెడ్డి ఇంటితో పాటు అందరి ఇళ్లకీ రెండు రోజుల నుంచి నీటి సరఫరా ఆగిపోయిందని వివరించారు.
అన్ని గ్రామాలకు అందిస్తాం..
రాజకీయ లబ్ధి కోసమే జానారెడ్డి.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎర్రబెల్లి ఆరోపించారు. ఈ రోజు ఆయన ఇంటికి అధికారులను పంపుతున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తండాలు లాంటి 90 గ్రామాలకు మిషన్ భగీరథ రావడం లేదని.. త్వరలోనే వాటికి కూడా తాగు నీటిని అందిస్తామని హామీ ఇచ్చారు.