విభజన చట్టంలోని హామీలను కేంద్రం తుంగలో తొక్కిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భాజపా నేతలు పాదయాత్రలు ఎందుకు చేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని గతంలో కాంగ్రెస్ మోసం చేయగా.. ఇప్పుడు భాజపా మోసం చేస్తోందని మంత్రి మండిపడ్డారు. కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణ ప్రజల హక్కు అని మంత్రి స్పష్టం చేశారు. అసెంబ్లీ అవరణలోని తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
విభజన చట్టంలోని కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు హామీలను కేంద్రం పూర్తిగా విస్మరించిందని ధ్వజమెత్తారు. వరంగల్ వచ్చినప్పుడల్లా బండి సంజయ్ కోచ్ ఫ్యాక్టరీ తెస్తామని చెబుతున్నారని మంత్రి అన్నారు. హామీలు నెరవేర్చకుండా రాష్ట్రంలో పాదయాత్రలు ఎందుకు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. విభజన హామీలు అమలు చేశాకే భాజపా నేతలు రాష్ట్రంలో తిరగాలని మంత్రి సూచించారు.
ధాన్యం ఎక్కడ అమ్ముకోవాలి
రైతులు పండించిన ధాన్యాన్ని కొనకుంటే ఎక్కడ అమ్ముకోవాలని కేంద్రాన్ని మంత్రి ప్రశ్నించారు. ఎంత నష్టం వచ్చినా సరే భరించి కూడా రైతుల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేశామని... ఇప్పుడు రైస్ మిల్లులు వరిధాన్యంతో నిండిపోయాయని ఆయన అన్నారు. కేంద్రం భాజపా పాలిత రాష్ట్రాలకే ప్రాధాన్యత ఇస్తోందని ఎర్రబెల్లి ఆక్షేపించారు. తెలంగాణ రైతుల ధాన్యాన్ని ఎందుకు కొనరని ఆయన ప్రశ్నించారు. ఈ సీజన్లో రైతన్నలు పండించే ధాన్యం ఎక్కడ అమ్ముకోవాలో కేంద్రం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
వరంగల్ వచ్చినప్పుడల్లా బండి సంజయ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెస్తామని స్టేట్మెంట్ ఇచ్చేది. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని తెలంగాణలో తిరుగుతున్నారు. ఏం చేశారని మీ పాదయాత్రలు. దేనీకోసం మీ యాత్రలు. రైస్ మిల్లులలో ధాన్యం నిల్వ చేశాం. మీరు కొంటామంటేనే కదా మేం కొన్నాం. ఇప్పుడు మీరు కొననంటే ఆ ధాన్యం ఏం కావాలి. భాజపా పాలిత రాష్ట్రాల్లో ధాన్యం కొంటారు. మరీ తెలంగాణలో ఎందుకు కొనరు. ఈ సీజన్లో రైతులు పండించే ధాన్యాన్ని ఏం చేయాలి. అన్ని పార్టీలు దీనిపై సమాధానం చెప్పాలి. విపరీతమైన నష్టాన్ని భరిస్తున్నాం. అయినా సరే రైతుల వద్ద ధాన్యం కొంటాం. రైస్ మిల్లుల్లో కూడా నిల్వలు నిండిపోయాయి. మరీ ఈ నష్టాలను ఎవరు భరించాలి.- ఎర్రబెల్లి దయాకర్ రావు, మంత్రి
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇదీ చూడండి:DEVADULA PROJECT: కాళేశ్వరం, దేవాదులతో ఉమ్మడి వరంగల్ సస్యశ్యామలం: ఎర్రబెల్లి