కేంద్రం కావాలనే రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆపుతోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. దీనివల్ల కొంత ఆర్థిక ఇబ్బంది ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి సుమారు రూ.1,100 కోట్ల నిధులు రావాల్సి ఉండగా.. రైతు కల్లాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.151 కోట్లు ఖర్చు చేయడాన్ని తప్పుగా భావించి నిధులు ఆపుతుందని విమర్శించారు.
పంచాయతీరాజ్ శాఖ అధికారులు, ఇంజినీర్లతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించిన ఆయన.. కొంతమంది సర్పంచులు బీజేపీ ట్రాప్‌లో పడి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిధుల విషయంపై సర్పంచులకు అవగాహన కార్యక్రమాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ప్రతి పంచాయతీలో రోడ్లు అద్దంలా ఉండాలని, రోడ్లపై గుంతలు కనిపించకుండా తగు చర్యలు తీసుకోవాలని మంత్రి ఇంజినీర్లను ఆదేశించారు.