హెచ్ఐవీ రోగులకు సరకులు పంపిణీ చేసిన ఈటల
దిల్సుఖ్నగర్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆస్పత్రిలో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో హెచ్ఐవీ వ్యాధిగ్రస్థులకు నిత్యావసర సరకులతో పాటు 61వేల రూపాయల నగదును మంత్రి ఈటల రాజేందర్ పంపిణీ చేశారు. స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సేవలను మంత్రి కొనియాడారు.
హైదరాబాద్ దిల్సుఖ్నగర్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆస్పత్రిలో చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో హెచ్ఐవీ వ్యాధిగ్రస్థులకు నిత్యావసర సరకులను మంత్రి ఈటల రాజేందర్ పంపిణీ చేశారు. దీంతో పాటు రంగనాథ రాజు ఫౌండేషన్ తరఫున 61 వేల రూపాయలను మంత్రి తన చేతుల మీదుగా అందజేశారు. చాలా మంది తెలియక వ్యాధికి గురై శిక్షను అనుభవిస్తున్నారని మంత్రి ఈటల తెలిపారు. సమాజంలో మానవత్వం బతికే ఉందని.. అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు వారిని ఆదుకోవడానికి ముందుకు వస్తున్నాయని తెలిపారు.
దాతృత్వానికి కొదవలేని దేశం మనదని మంత్రి పేర్కొన్నారు. వైద్యపరంగా ఇలాంటి సమస్యలు ఉన్న వారికి ప్రభుత్వం తరఫున సాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా పలు స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సేవలను కొనియాడారు.
ఇవీ చూడండి: కూల్చివేత ఎఫెక్ట్: ఆలయం, మసీదు దెబ్బతినటంపై సీఎం విచారం