కరోనా దృష్ట్యా తెలంగాణ వైద్య విభాగం నాలుగు రోజులుగా ఉత్కంఠగా ఉందని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ప్రజలకు అవగాహన కల్పించడంలో మీడియా బాగా సహకరించిందన్నారు. రాబోయేకాలంలో కూడా రాకూడదని కోరుకుందామన్నారు. కొవిడ్-19ను ఎలా ఎదుర్కోవాలంటూ కమిటీలు వేశామని... రాష్ట్ర ప్రభుత్వ చర్యలను చూసి కేంద్రం కితాబిచ్చిందని తెలిపారు.
ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనే సత్తా తెలంగాణ ప్రభుత్వానికి ఉందని వెల్లడించారు. ఈ వైరస్ గాలితో వచ్చేది కాదని... కరోనా వచ్చిందంటూ సాఫ్ట్‌వేర్ కార్యాలయాన్ని ఖాళీ చేశారని చెప్పారు. ఎప్పుడూ అతిగా స్పందించవద్దంటూ హితవు పలికారు. ఇప్పటివరకు తెలంగాణలో ఒక్కరికి కూడా కరోనా రాలేదని... గాంధీలో ఉన్న వ్యక్తికి కరోనా దుబాయిలో వచ్చిందని తెలిపారు. ఆ వ్యక్తి రెండ్రోజుల్లో డిశ్చార్జ్ అవ్వచ్చొని చెప్పారు.