కొవిడ్ సమయంలో పనిచేయడం అందరికీ గొప్ప జ్ఞాపకమని.. ప్రతి ఒక్కరికి భరోసా కల్పించి ప్రాణాలు కాపాడాలని ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. ఇప్పుడు ప్రతి ఇంట్లోకి కరోనా వచ్చిందని.. భయం లేకుండా ఎదుర్కొని ఆ మహమ్మారిని జయించవచ్చనే ధైర్యాన్ని ప్రతి ఒక్కరికి కల్పించాలని ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలకు మంత్రి సూచించారు. ప్రపంచంలో ఎక్కడైనా కరోనాకు చికిత్స ఒక్కటేనని అనవసరంగా కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోవద్దని చెప్పారు. హైదరాబాద్ ఎస్‌ఆర్ నగర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ వెల్పేర్ కార్యాలయంలో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 22వేల మంది ఆశా వర్కర్లు, 500మంది ఏఎన్‌ఎంలతో మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడారు. గ్రామాల్లో కరోనా పాజిటివ్ వ్యక్తులను మొదటి రోజే గుర్తించగలిగితే వ్యాప్తిని అరికట్టడంతో పాటు వారి ప్రాణాలను కాపాడగలుగుతామని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరికి భరోసా కల్పించి ప్రాణాలు కాపాడాలి: మంత్రి ఈటల - covid-19
ప్రతి ఒక్కరికి భరోసా కల్పించి ప్రాణాలు కాపాడాలని ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలకు మంత్రి ఈటల సూచించారు. జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 22వేల మంది ఆశావర్కర్లు, 500 మంది ఏఎన్‌ఎంలతో మంత్రి మాట్లాడారు. కరోనా మహమ్మారిని జయించవచ్చనే ధైర్యాన్ని ప్రతి ఒక్కరికి కల్పించాలని వారికి సూచించారు.
ప్రజల భాగస్వామ్యంతోనే ఇలాంటి వ్యాధులను ఎదుర్కోగలుగుతామని సీఎం కేసీఆర్ పదే పదే చెబుతుంటారని... ఇతర సీజనల్ వ్యాధులు, కరోనా ఒకే లక్షణాలు కలిగి ఉన్నాయన్నారు. కాబట్టి సాధ్యమైనంత తొందరగా పరీక్షలు చేసి నిర్ధారణ చేసుకోవాలన్నారు. జనవరి వరకు ఇదే పరిస్థితి ఉంటుందన్నారు. రాపిడ్ పరీక్షలో నెగెటివ్ వచ్చిన వారికి లక్షణాలు ఉంటే తప్పనిసరిగా ఆర్‌టీపీసీఆర్ పరీక్ష చేయించాలని మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పలువురు ఆశా,ఏఎన్‌ఎంలతో మంత్రి జూమ్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వీరి సమస్యలు అన్ని తీరుస్తామని హామీ ఇచ్చారు. జీతం పెంచే విషయంలో సీఎంతో చర్చిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భద్రాద్రి జిల్లా ఎర్రగుంట పీహెచ్‌సీ సుశీల, వనపర్తి జిల్లా మదనపురం లీలమ్మ, హైదరాబాద్ రాణిగంజ్ నల్లగుట్ట పద్మ, గ్యాస్ మండి శ్రీలక్ష్మిలను మంత్రి అభినందించారు. ఈ కాన్ఫరెన్స్‌లో ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ వాకాటి కరుణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.