తెలంగాణ

telangana

ETV Bharat / state

'కొరత ఉన్నా... ఆక్సిజన్​ లేక మృతి చెందే పరిస్థితి మాత్రం లేదు' - హైదరాబాద్​ తాజా వార్తలు

రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత ఉందని, సరఫరాను కేంద్రమే నియంత్రణలోకి తీసుకుందని... రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ముందుచూపే కరోనా నుంచి మనల్ని కాపాడుతోందని అన్నారు. కేసులు వస్తున్నా రాష్ట్రంలో ప్రమాద తీవ్రత తక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు.

Minister eetala Rajender said there was a shortage of oxygen in the state
రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత ఉందన్న మంత్రి ఈటల రాజేందర్​

By

Published : Apr 18, 2021, 4:23 AM IST

Updated : Apr 18, 2021, 5:14 AM IST

‘‘రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత ఉంది. సరఫరాను కేంద్రమే నియంత్రణలోకి తీసుకుంది. రాష్ట్రానికి రోజుకు 250 టన్నులు కావాలి. ప్రస్తుతం 150 టన్నుల వరకు వస్తోంది. అయితే, ఆక్సిజన్‌ లేక మృతి చెందే పరిస్థితి ప్రస్తుతానికి లేదు. రాష్ట్ర ప్రభుత్వ ముందుచూపే కరోనా నుంచి మనల్ని కాపాడుతోంది. రాష్ట్రం ఆరోగ్య హబ్‌ కావటంతో వైద్యపరంగా దేశంలోని ఇతర రాష్ట్రాల కన్నా మనం ముందంజలో ఉన్నాం. ప్రజల్లో చైతన్యం పెరిగింది. ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. అప్రమత్తంగా లేకపోతే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కేసులు వస్తున్నా రాష్ట్రంలో ప్రమాద తీవ్రత తక్కువగా ఉంది’’ అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు.
అత్యవసరం కాని శస్త్రచికిత్సలు తాత్కాలికంగా ఆపేశాం
‘‘రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో పడకలకు కొరత లేదు. అన్ని ఆసుపత్రుల్లో అత్యవసరం మినహా ఇతర శస్త్రచికిత్సలను తాత్కాలికంగా ఆపేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ వైద్యంలో, ప్రైవేటు రంగంలో, మెడికల్‌ కళాశాలలలో సుమారు 50 నుంచి 60 వేల పడకలు ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్న పడకలతో పోలిస్తే ఆసుపత్రులకు వస్తున్న వారి సంఖ్య తక్కువే. కరోనా లక్షణాలున్నా ఆందోళనకు గురి కావద్దు. కుటుంబ వైద్యుల సూచనల మేరకు ఆసుపత్రుల్లో చేరే విషయంలో నిర్ణయం తీసుకోవటం మంచిది.
అన్నీ ముందస్తుగానే సమకూర్చుకున్నాం...
ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే స్థితిలో ప్రభుత్వం ఉంది. పరీక్ష కిట్లు పూర్తిస్థాయిలో ఉన్నాయి. వైద్యులకు అవసరమైన మాస్కులు, పీపీఈ కిట్లు, బాధితులకు అవసరమైన అన్ని ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్‌ నుంచి పారామెడికల్‌ సిబ్బంది వరకూ ఎక్కడా ఇబ్బంది లేదు. ప్రభుత్వం అప్రమత్తమై అన్నింటినీ ముందస్తుగానే సమకూర్చుకుంది. ఖర్చుల విషయంలో ప్రభుత్వం ఎక్కడా రాజీపడటం లేదు. కరోనా వ్యాక్సిన్లు మరిన్ని కావాలని కేంద్రాన్ని కోరాం. ప్రస్తుతం 45 సంవత్సరాలు పైబడిన వారికే వేస్తున్నాం. 25 సంవత్సరాల వారికి కూడా వేయాలని కేంద్రానికి సూచించాం. కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
అందరినీ ఇబ్బంది పెట్టలేం...
గడిచిన ఏడాది వైరస్‌ ప్రబలినప్పుడు దాని ఆనుపానులు ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కలేదు. చికిత్స ఏమిటో కూడా తెలియని పరిస్థితి. అందుకోసం లాక్‌డౌన్‌ పెట్టాల్సి వచ్చింది. ప్రస్తుతం వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. చికిత్సా విధానంలోనూ స్పష్టత ఉంది. వైరస్‌లో నూతన వేరియంట్లు రావచ్చు. వైద్యులు వాటికీ చికిత్స చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మరో దఫా లాక్‌డౌన్‌, కంటెయిన్‌మెంట్లు అవసరం లేదన్న అభిప్రాయం నిపుణుల నుంచి వ్యక్తం అవుతోంది. ప్రజలు అప్రమత్తం అవుతున్నారు. నిర్లక్ష్యంగా ఉన్న వారు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రత్యేకించి వయసు మళ్లిన వారు, వివిధ రకాల అనారోగ్యాలతో ఉన్న వారు జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్కు జీవన గమనంలో భాగం కావాలి.
22 ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ బల్క్‌ స్టోరేజీ...
రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత కొంతమేరకు ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ఆక్సిజన్‌ లేక బాధితులు ఇబ్బందిపడే పరిస్థితి ప్రస్తుతానికి లేదు. రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రల నుంచి ఆక్సిజన్‌ వస్తుంది. వైరస్‌ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ఆయా రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాలకు సరఫరాను పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకుంది. ఏ రాష్ట్రంలో ఎన్ని కేసులు వస్తున్నాయి? ఎన్ని కేసుల్లో ఆక్సిజన్‌ అవసరమవుతోంది? కేసుల సంఖ్య మరింత పెరిగితే ఎంత కావాలి? తదితర వివరాలను సేకరిస్తోంది. అవసరాల మేరకు సరఫరా చేస్తామని స్పష్టం చేసింది. ముందుజాగ్రత్తగా రాష్ట్రంలోని 22 ప్రధాన ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ బల్క్‌ స్టోరేజీ ఏర్పాటు చేశాం’ అని మంత్రి ఈటల వివరించారు.

Last Updated : Apr 18, 2021, 5:14 AM IST

ABOUT THE AUTHOR

...view details