కరోనా లక్షణాలు లేనివాళ్లు పరీక్షలు చేసుకోవద్దని మరోమారు స్పష్టం చేశారు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. హైదరాబాద్‌లో ఏదో అవుతుందని దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రతిష్ఠకు మసిపూసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ చిత్తశుద్ధిని ఎవరూ శంకించొద్దని విజ్ఞప్తి చేశారు. కరోనా లక్షణాలు ఉంటే పీహెచ్‌సీల్లో సంప్రదించాలని కోరారు. పీహెచ్‌సీ స్థాయిలోనే నమూనాలు సేకరిస్తారని స్పష్టం చేశారు. ప్రభుత్వ వైద్యంలోనే అన్ని రకాల సేవలు అందిస్తూ.. రూపాయి ఖర్చు లేకుండా సేవలు అందిస్తున్నామని వివరించారు.
ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. నాలుగైదు రోజుల్లో టిమ్స్‌ను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే టిమ్స్‌లో అవుట్ పేషెంట్లకు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చిన ఇంటిలోని వాళ్లపై సామాజిక బహిష్కరణ విధించడం, అంతిమ సంస్కారాలను అడ్డుకోవడం సంస్కారం కాదన్నారు.