కరోనాపై ఆందోళన అవసరం లేదన్నారు వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. బస్సులు, రైళ్లలో ప్రయాణిస్తే మిగతా అందరికీ వైరస్ వ్యాపించదని స్పష్టం చేశారు. కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని ఈటల వెల్లడించారు. మిలిటరీ, చెస్ట్, ఫీవర్, వికారాబాద్ ఆస్పత్రుల్లో ఐసోలేషన్ కోసం ఏర్పాట్లు చేశామన్నారు. వైద్య కళాశాలల్లో 600 నుంచి 800 వరకు పడకలు ఉన్నాయని వివరించారు.
వైద్య కళాశాలల్లో 200 పడకలు ఐసోలేషన్ కోసం వాడేలా చర్యలు చేపట్టామన్నారు. ఆస్పత్రుల్లో 3 వేల పడకలకు పైగా వాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఈటల తెలిపారు. 200 నుంచి 300 మందికి వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని.. కేంద్ర ప్రభుత్వంతోనూ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని ఈటల వెల్లడించారు. మాస్కులు సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామన్న ఈటల.. రైళ్లు, బస్సులు, పార్కులు, సినిమా హాళ్లు తదితర బహిరంగ ప్రదేశాల్లో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కరోనా వైరస్‌పై 104 హెల్ప్‌లైన్ నంబర్ అందుబాటులో ఉందని మంత్రి తెలిపారు. కొంతకాలం పాటు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని కోరారు.