రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పెరుగుతున్న కారణంగా వైరస్ నిర్ధారణ పరీక్షలు వేగవతం చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతమున్న ఆస్పత్రులతో పాటు మరో రెండు ప్రయోగశాలలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. ఈఎస్‌ఐ ఆసుపత్రితో పాటు ఫోరెన్సిక్ ల్యాబ్‌లో కూడా ఈనెల 18 నుంచి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఒక్కో దాంట్లో రోజుకు 200 పరీక్షల చొప్పున చేయనున్నామన్నారు. ఇవి కాకుండా ఐపీఎంలో అత్యాధునిక నిర్ధారణ పరీక్షల యంత్రాన్ని కూడా మరో రెండువారాల్లో నెలకొల్పనున్నామన్నారు. కోఠిలోని ఆరోగ్య కార్యాలయంలో వైద్యవిద్య సంచాలకులు డాక్టర్ రమేశ్‌రెడ్డి, ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావుతో కలిసి మంత్రి వివరించారు.
‘గచ్చిబౌలిలో 1,500 పడకలతో అత్యాధునిక ఆసుపత్రిని ఈనెల 20న ప్రారంభించనున్నాం. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పాజిటివ్ కేసుల్లో ఎక్కువ మంది ఆరోగ్యంగానే ఉన్నారు. వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది కోసం 10 లక్షల పీపీఈ కిట్లు, 10 లక్షల ఎన్ 95 మాస్కులు, కళ్లద్దాల కొనుగోలుకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పటికే ప్రభుత్వం వద్ద 3.28 లక్షల ఎన్ 95 మాస్కులు, 2.45 లక్షల పీపీఈ కిట్లున్నాయి. లక్షల సంఖ్యలో మాస్కులు స్థానికంగా ఉత్పత్తి చేస్తున్నారు. ఎక్కడా వీటి లోటు లేదు. పాజిటివ్ వచ్చిన వారి నుంచి 21 రోజుల తర్వాత రక్తం సేకరించి, ప్లాస్మాథెరపీ నిర్వహించడం కోసం ఐసీఎంఆర్ అనుమతికి దరఖాస్తు చేశాం. వారు అనుమతిస్తే చికిత్స ప్రక్రియను ప్రారంభిస్తాం. కరోనా పాజిటివ్ మృతులు నమోదైతే దాచాల్సిన అవసరం లేదు. కుటుంబాలు ఆకలితో అలమటించొద్దనే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఆదేశాలతో వందల కేంద్రాల్లో భోజన వసతి కల్పిస్తున్నాం. బియ్యం, నగదు కూడా ఇస్తున్నాం. డబ్బులు డ్రా చేయడానికి బ్యాంకుల ముందు ప్రజలు పెద్దఎత్తున వరుసల్లో దగ్గర దగ్గరగా నిలబడుతున్నారు. నిర్దేశించిన తేదీల్లో మాత్రమే బ్యాంకులకు వస్తే.. ఈ రద్దీ తగ్గుతుంది. పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్కులు ఇవ్వడం లేదని కొందరు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. దీన్ని ప్రజలు హర్షించరు. కేంద్ర ప్రభుత్వం కంటే ముందుగా ప్రజల సంరక్షణపై స్పందించింది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరే. లాక్‌డౌన్‌ను కూడా ఇక్కడే ముందుగా ప్రకటించాం’ అని మంత్రి ఈటల తెలిపారు.
ప్రమాద ప్రాంతాల్లోనే పీపీఈ కిట్‌లు
కరోనా బాధితులకు వైద్యం అందించే బృందానికి కేంద్ర మార్గదర్శకాల ప్రకారం వ్యక్తిగత రక్షణ (పీపీఈ) కిట్‌లను అందుబాటులో ఉంచుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. అత్యంత ప్రమాదకర ప్రాంతాలైన ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లు, అత్యవసర విభాగాలు, అంబులెన్స్‌ల్లో కరోనా రోగి తరలింపు సమయాల్లో ఈ కిట్‌లను వినియోగిస్తున్నామంది. మిగిలినవారికి ఎన్95, మూడు పొరల మాస్క్‌లు, గ్లౌజ్‌లు వాడుతున్నట్లు పేర్కొంది. ఆస్పత్రులను కూడా క్వారంటైన్, చికిత్స, ల్యాబ్‌లు, తదితర పరిస్థితులకు అనుగుణంగా విభజించి కిట్‌లు అందజేస్తున్నామంది. 3,53,210 పీపీఈ కిట్‌లకు ఆర్డర్ చేశామని, 51,475 అందాయని తెలిపింది. 600 వెంటిలేటర్ల కొనుగోలు చేయనున్నట్లు పేర్కొంది. 53 రకాల మందుల సేకరణ జరుగుతోందంది. రాష్ట్రంలో 7 ల్యాబ్‌లు రోజుకు 900 పరీక్షలు నిర్వహిస్తున్నాయంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు కాగా.. తాము తీసుకుంటున్న అన్ని చర్యలపై పూర్తి స్థాయి నివేదికను హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది.
నివేదికలో అంశాలివీ
* మొత్తం 7,72,480 ఎన్95 మాస్క్‌లకు ఆర్డర్ ఇవ్వగా 1,61,980 అందాయి. ప్రస్తుతం 73,227 ఉన్నాయి. 53 లక్షల మూడు పొరల మాస్క్‌లకు ఆర్డర్ ఇవ్వగా, 25.50 లక్షలు అందాయి. 22.48 లక్షలు అందుబాటులో ఉన్నాయి. 34 లక్షల గ్లౌజ్‌లకు ఆర్డర్ ఇవ్వగా 10.34 లక్షలు సరఫరా కాగా, ఇవి 23 లక్షలు అందుబాటులో ఉన్నాయి.