భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడి హోదాలో ఉండి... ఒక గల్లీ కార్యకర్త కంటే హీనంగా మాట్లాడారని జేపీ నడ్డాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. కరోనా విషయంలో తెరాసపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. భాజపాకు రాజకీయాలే తప్ప... పేద ప్రజల ప్రాణాలు కాపాడే ఆలోచన లేదని విమర్శించారు.
భాజపా చిల్లర రాజకీయాలు చేయొద్దు : ఈటల రాజేందర్ - ఈటల రాజేందర్ తాజా వార్తలు
15:07 June 21
భాజపా చిల్లర రాజకీయాలు చేయొద్దు : ఈటల రాజేందర్
భారతీయ జనతా పార్టీ చిల్లర రాజకీయాలు చేస్తోందని... తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. కరోనా పరీక్షలు-మరణాల విషయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా... రాష్ట్ర ప్రభుత్వంపై పచ్చి అబద్ధాలు మాట్లాడారని ధ్వజమెత్తారు. కరోనా కట్టడిలో సఫలమైన రాష్ట్రం తెలంగాణ అని వివరించిన ఈటల... దిల్లీ స్థాయి నేత, గల్లీ నాయకుడి కంటే దిగజారి మాట్లాడటం దురదృష్టకరమని అన్నారు. తెలంగాణపై ఆరోపణలు చేసే ముందు... భాజపా పాలిత రాష్ట్రాల్లో పనితీరు చూసుకోవాలని హితవు పలికారు. కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం పనితీరును కేంద్ర బృందాలు మెచ్చుకున్నాయన్న మంత్రి... రాష్ట్రానికి రావాల్సిన ఆరోగ్య యంత్రాన్ని పశ్చిమబంగకు తరలించారని ఆరోపించారు. భాజపాకు రాజకీయాలే తప్ప... పేదల ప్రాణాలు కాపాడే ఆలోచన లేదని ఈటల విమర్శించారు. కంటైన్మెంట్ అనే పదానికి అర్థం చెప్పిన రాష్ట్రం తెలంగాణ అని... ప్రజల ప్రాణాలను కాపాడుకోవటంలో మా నిబద్ధతను ఎవరూ శంఖించలేరని అన్నారు. కరోనా కట్టడికి అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిపివేయాలని మొదట సూచించింది కేసీఆరే అని గుర్తు చేశారు.
ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తెలంగాణలో 17వేల బెడ్లను సిద్ధంగా ఉంచినట్లు... ఇప్పుడు వాటిలో 6శాతం మాత్రమే ఆక్యుపెన్సీ ఉందని వివరించారు. వెయ్యి వెంటిలేటర్లు కావాలని అడిగితే 50 మాత్రమే ఇచ్చి, చేతులు దులుపుకున్నారని అసహనం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి తగినంత సహాయ సహకారాలు అందకపోయినా... కరోనాను కట్టడి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. 14లక్షల ఎన్-95 మాస్క్లు, 10 లక్షల పీపీఈ కిట్లను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ఆరోగ్య రంగంలో కేరళ, చెన్నైల తర్వాత తెలంగాణ ముందు వరుసలో ఉందని వివరించారు.
ఇదీ చూడండి :ఎన్నికల్లో 'కరోనా ట్రెండ్'కు ఆ రాష్ట్రం నుంచే నాంది!