స్థానిక సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఏపీలో ఇంటి పన్నును 15 శాతానికి మించకుండా పెంచాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గతంలో ఇంటిపై వచ్చే ఆదాయంపైన పన్ను విధించే వారని.. ఇకపై ఆస్తి విలువ పై పన్ను విధించాలని నిర్ణయించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దీన్ని అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఏపీలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ పన్ను పెంపు అమల్లోకి వచ్చిందన్నారు. మొత్తం ఆస్తి విలువపై 0.10 శాతం నుంచి 0.50 శాతం పన్ను వేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఇప్పుడు కడుతోన్న పన్ను కంటే 10 నుంచి 15 శాతం పన్ను మాత్రమే పెంచాలని ఆదేశాల్లో తెలిపారన్నారు. ఏపీ ప్రభుత్వంపై కొందరు కావాలని బురదజల్లుతున్నారని, తమ ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసే కుట్ర జరుగుతోందన్నారు. ఏపీలో 377 చదరపు అడుగుల లోపు ఉండే ఇంటికి 50 రూపాయలు మాత్రమే ఇంటి పన్ను ఉంటుందని... అంతకన్నా ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఉండదన్నారు. మిగిలిన చోట కూడా ఆస్తి విలువ మేరకు ప్రస్తుత పన్నుపై 0.10 నుంచి 0.50 వరకు పన్ను పెరుగుతుందని బొత్స స్పష్టం చేశారు.