Botsa on Narayana: పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ప్రమేయం ఉన్నవారందరినీ అరెస్టు చేసినట్లు.. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పేపర్ లీకేజీ ఘటనపై 60 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. తప్పు చేస్తే ఎవరినీ వదిలేది లేదన్న ఆయన.. తప్పు చేయలేదని ఎవరైనా నిరూపించుకోగలరా? అని ప్రశ్నించారు. సచివాలయంలో సీఎం జగన్‌ను కలిసిన మంత్రి బొత్స.. పదోతరగతి పేపర్ లీకేజీ కేసులో నారాయణ అరెస్టు, ఇతర అంశాలపై చర్చించారు. పదో తరగతి పేపర్‌ను వాట్సాప్‌లో పంపి మాస్ కాపీయింగ్‌కు యత్నించారని అన్నారు. మాస్ కాపీయింగ్‌లో నారాయణ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ కూడా ఉన్నారని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారని మంత్రి బొత్స వెల్లడించారు.
"బోధన, బోధనేతర సిబ్బంది కాపీయింగ్ చేయించేందుకు ప్రయత్నం. ఇప్పటివరకు 60 మందిని అరెస్టు చేశాం. 38 మంది ప్రభుత్వ, 22 మంది ప్రైవేట్ టీచర్లు అరెస్టు. లీకేజ్ కేసులో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. తప్పు చేస్తే ఎవరినైనా పోలీసులు అరెస్టు చేస్తారు. అమరావతి రింగ్‌రోడ్‌లో అక్రమాలు లేకుంటే కేసు ఎందుకు పెడతారు ?. రింగ్‌రోడ్ కేసులో నారాయణను అరెస్టు చేశారా అనేది నాకు తెలియదు."-బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి