తెలంగాణ

telangana

ETV Bharat / state

కోర్టు ఆదేశాలు ధిక్కరణ.. సంక్రాంతి లక్కీ డ్రా నిర్వహించిన అంబటి - Case Registered Against Minister Ambati Rambabu

SANKRANTI LUCKY DRA: కోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా మంత్రి అంబటి రాంబాబు లక్కీడ్రాను నిర్వహించారు. సంక్రాంతి సంబురాలను ఘనంగా నిర్వహిస్తామని స్వయంగా మంత్రే పేర్కొనడం కోర్టు ఆదేశాలను లెక్కచేయడం లేదని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఈ వేడుకలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

SANKRANTI LUCKY DRA
వైఎస్సార్​ లక్కీడ్రా

By

Published : Jan 13, 2023, 10:06 AM IST

కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా లక్కీడ్రా నిర్వహించిన మంత్రి అంబటి రాంబాబు

SANKRANTI LUCKY DRA: ‘ఐదేళ్లుగా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నాం. భవిష్యత్తులోనూ చేస్తూనే ఉంటాం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎందరు అడ్డుపడినా సంబరాలు ఆగవు’ అని ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. వైసీపీ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లి జిల్లా పరిషత్‌ సుగాలీ ఉన్నత పాఠశాలలో గురువారం రాత్రి నిర్వహించిన సంక్రాంతి సంబురాల ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఎక్కడా ఇంత భారీగా ముగ్గుల పోటీలు నిర్వహించలేదని ధైర్యంగా చెబుతున్నా.. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న 9,440 మందికీ జ్ఞాపికలు ఇంటికి చేరుస్తామని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ముగ్గు వేసి రూ.2లక్షలు సంపాదించే అవకాశం సత్తెనపల్లి నియోజకవర్గ మహిళలకే ఉందని వ్యాఖ్యానించారు. ఎప్పుడూ విమర్శలేనా.. కాసేపు పండగ సంస్కృతిని ఆస్వాదించాలని ఛలోక్తులు విసిరారు. అందరితో కలసి సంక్రాంతి పండగ చేసుకోవాలనే ఈ సంబురాలు ఏర్పాటుచేశామని మంత్రి పేర్కొన్నారు.

‘రాజకీయాల్లో ప్రతిపక్షాలకు జగన్‌ తర్వాత అంబటి రాంబాబే టార్గెట్‌’ అని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ అన్నారు. పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, విజయవాడ మేయర్‌ రాయని భాగ్యలక్ష్మి మాట్లాడారు. ముగ్గుల పోటీల్లో విజేతలుగా నిలిచిన టి.తిరుపతమ్మకు రూ.2లక్షలు, పి.శ్రీలతకు రూ.లక్ష, యు.సుహాసినికి రూ.50వేలు (ముగ్గురూ నకరికల్లు మండలానికి చెందినవారే), టి.రామలింగేశ్వరి (చాగంటివారిపాలెం) రూ.25వేలు అందజేశారు. లక్కీ డ్రా తీసి విజేతల వివరాలు ప్రకటించారు. మంత్రి అంబటి రాంబాబు సతీమణి విజయలక్ష్మి, సత్తెనపల్లి మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ చలంచర్ల లక్ష్మీతులసి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

‘లక్కీ డిప్‌ సరదా కోసం పెట్టిందే. దీన్ని చూసి కొంతమందికి కడుపు మంట కలుగుతోంది. ఇది నియోజకవర్గ ప్రజలు ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఉండాలని చేస్తున్న కార్యక్రమం తప్ప మరొకటి కాదు. - అంబటి రాంబాబు, మంత్రి

కోర్టు ఆదేశించినా.. మారని తీరు:కోర్టు ఆదేశాలు, ప్రతిపక్షాల విమర్శలు పట్టించుకోలేదు. వైఎస్‌ఆర్‌ సంక్రాంతి లక్కీ డ్రా వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని గుంటూరు ప్రధాన సీనియర్‌ సివిల్‌ జడ్జి బుధవారమే పోలీసులను ఆదేశించారు. ఇది జరిగి 24 గంటలు గడవకముందే పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని జిల్లా పరిషత్‌ సుగాలి ఉన్నత పాఠశాలలో గురువారం రాత్రి సంక్రాంతి లక్కీ డ్రా నిర్వహించారు.

కోర్టు ఆదేశాల నేపథ్యంలో లక్కీ డ్రా నిర్వహణపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. కూపన్‌పై ఈ నెల 12వ తేదీ సాయంత్రం లక్కీ డ్రా నిర్వహిస్తామని ముద్రించారు. గురువారం మధ్యాహ్నం నుంచి డ్రా తీసేందుకు ఎంపికచేసిన పాఠశాల ఆవరణలో కూపన్లు అమ్మకానికి పెట్టారు. డ్రా తీసే కొన్ని నిమిషాల ముందువరకూ కూపన్లు విక్రయించారు. వేదికపై వజ్రాలహారం పెట్టారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో టీడీపీ, జనసేన నాయకులు మంత్రి అంబటి రాంబాబుపై విమర్శలు గుప్పించారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details