తెలంగాణ

telangana

ETV Bharat / state

'చంద్రబాబు తప్పిదాలే.. పోలవరం ప్రాజెక్టు పాలిట శాపాలు'

Minister Ambati on Babu: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ కాంట్రాక్టర్‌ను మార్చే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనల ప్రకారమే వ్యవహరించిందని ఆ రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ట్రాన్స్‌ట్రాయ్‌ నుంచి పనులను నవయుగ సంస్థకు అప్పగించిన సమయంలో చంద్రబాబు ఏకపక్షంగా వ్యవహరించారని అంబటి ఆరోపించారు. పోలవరం నిర్మాణంలో చంద్రబాబు చేసిన తప్పిదాలే ప్రాజెక్టు పాలిట శాపాలుగా మారాయన్నారు.

'చంద్రబాబు తప్పిదాలే.. పోలవరం ప్రాజెక్టు పాలిట శాపాలు'
'చంద్రబాబు తప్పిదాలే.. పోలవరం ప్రాజెక్టు పాలిట శాపాలు'

By

Published : Jul 25, 2022, 7:22 PM IST

Polavaram: పోలవరం నిర్మాణంలో చంద్రబాబు చేసిన తప్పిదాలే ప్రాజెక్టు పాలిట శాపాలుగా మారాయని ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరగడం వల్లే పోలవరం ప్రాజెక్టుకు నష్టం వాటిల్లిందని ఐఐటీ హైదరాబాద్ నివేదిక ఇవ్వటంపై మంత్రి వివరణ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ కాంట్రాక్టర్‌ను మార్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారమే వ్యవహరించిందని.. ట్రాన్స్‌ట్రాయ్‌ నుంచి పనులు నవయుగ సంస్థకు అప్పగించిన సమయంలో చంద్రబాబు ఏకపక్షంగా వ్యవహరించారని అంబటి ఆరోపించారు. కాఫర్‌ డ్యామ్‌లు పూర్తి చేసిన తర్వాత డయాఫ్రం వాల్ నిర్మాణం చేపట్టాల్సి ఉన్నా.. అప్పటి ప్రభుత్వం, మాజీ మంత్రి దేవినేని ఉమా ముడుపుల కోసం అన్ని పనుల్ని ఏకకాలంలో చేపట్టారని ఆరోపించారు.

కాఫర్‌ డ్యామ్‌ల నిర్మాణాన్ని ప్రారంభించినా.. పూర్తి చేయలేదని అదే సమయంలో 35 అడుగుల కాంటూరులో కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ముంపు మండలాల ప్రజలు సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ను ఆశ్రయించారని గుర్తు చేశారు. కాఫర్‌ డ్యామ్​ 35 అడుగుల పరిధిలో పోలవరం బ్యాక్‌ వాటర్‌లో 60 గ్రామాలు ఉంటే 15 గ్రామాలను మాత్రమే ఖాళీ చేయించారని ఫలితంగా కాఫర్‌ డ్యామ్ పనుల్ని నిలిపివేశారని గుర్తు చేశారు. పోలవరం ఎర్త్‌కం రాక్​ఫిల్ డ్యామ్‌లో భాగంగా డయాఫ్రం వాల్‌ నిర్మాణం చేపట్టడానికి ముందే అప్పర్, లోయర్ కాఫర్‌ డ్యామ్‌ల నిర్మాణం పూర్తి చేసి ఉండాల్సిందన్నారు. పోలవరం ప్రాజెక్టులో గోదావరి జలాలను స్పిల్‌ వే మీదకు మళ్లించే పనులు కూడా గత ప్రభుత్వం పూర్తి చేయలేదని అంబటి ఆరోపించారు. గోదావరి నీరు వచ్చే అప్రోచ్ ఛానల్ పనులు కూడా పూర్తి కాలేదని, స్పిల్‌ వే, స్పిల్ ఛానల్ పనులు వైకాపా ప్రభుత్వం వచ్చాక పూర్తి చేశామన్నారు. పునరావాసం పూర్తి చేసి పోలవరం నిర్మాణం జరగాల్సి ఉండగా కమిషన్లు వచ్చే పనులు ముందు చేపట్టి ప్రజల్ని విస్మరించారని అంబటి ఆరోపించారు.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details