వర్షాకాలం నేపథ్యంలో మూసీలో పేరుకుపోయిన చెత్తను, పిచ్చి మొక్కలను దశలవారీగా తీసివేసే కార్యక్రమం కొనసాగించాలని అధికారులను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. తద్వారా దోమల బెడదను కొంత వరకు తగ్గించగలిగే అవకాశం ఉందన్నారు. మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌పై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. కార్పొరేషన్ చైర్మన్ సుధీర్ రెడ్డి తో పాటు సంబంధిత అధికారులు హాజరయ్యారు. మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చేపట్టబోయే భవిష్యత్ ప్రణాళికలపై చర్చించేందుకు త్వరలో మరో సమావేశం ఏర్పాటు చేస్తామని కేటీఆర్ వెల్లడించారు.
మూసీ వెంబడి చెత్త వేయకుండా ఫెన్సింగ్ వేయించాలి. కబ్జాలకు గురి కాకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. సీసీ కెమెరా కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసుకోవాలి. మూసీ అభివృద్ధితో పాటు సుందరీకరణపై రెవెన్యూ, హెచ్ఎండీఏ, జలమండలి విభాగాలతో కలిసి సమన్వయం చేసుకోవాలి. మురుగు నీటి శుద్ధి కేంద్రాల ప్రణాళికలు, మూసీ అభివృద్ధి ప్రణాళికలు సమన్వయంతో చేయాలి.