తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫిర్‌ ఏక్‌ బార్‌.. పతంగ్‌ ప్రహార్‌ - జీహెచ్​ఎంసీ ఎన్నికలు 2020

గ్రేటర్​ ఎన్నికల్లో మజ్లిస్​ మరోసారి ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రత్యర్థి పార్టీలు ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ కంచుకోటను ఏమి చేయలేరని నిరూపించింది. గతంలో కన్నా అత్యధిక ఓట్ల శాతంతో పాటు భారీ మెజార్టీలు సాధించింది.

mim performance in ghmc elections
ఫిర్‌ ఏక్‌ బార్‌.. పతంగ్‌ ప్రహార్‌

By

Published : Dec 6, 2020, 10:24 AM IST

ప్రజలతో నిరంతరం ఉంటాం.. పేదలకు అండదండగా నిలుస్తాం.. అంటూ ప్రచారం నిర్వహించిన మజ్లిస్‌ తాజా ఎన్నికల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రత్యర్థి పార్టీలు తమను ఓడిచేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా దారుస్సలాం కంచుకోటను బద్దలు కొట్టలేరని నిరూపించింది. ఎంపీ అసదుద్దీన్‌ నేతృత్వంలో మజ్లిస్‌ నాయకులు, కార్యకర్తలు శ్రమించి 44 డివిజన్లలో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించారు. ఇంతేకాదు.. మజ్లిస్‌కు వ్యతిరేకంగా భాజపా, కాంగ్రెస్‌లు తీవ్రమైన వ్యాఖ్యలు చేసినా వాటిని తిప్పికొట్టి తమ పార్టీ మాత్రమే డివిజన్లలో అభివృద్ధి పనులు చేయిస్తుందని ఓటర్లకు హామీ ఇచ్చి వారి ఆమోదం పొందారు. దీంతోపాటు తాజా ఎన్నికల్లో కార్పొరేటర్లుగా బరిలోకి దిగిన ముగ్గురు హిందువులు స్వామియాదవ్‌, ఎస్‌.రాజ్‌మోహన్‌, తారాబాయిలు గాలిపటం గుర్తుతో గెలుపొందారు. ముస్లింలంతా సంఘీభావం ప్రకటించాలని, అభ్యర్థి ఎవరైనా సరే మజ్లిస్‌కు మద్దతు పలకాలంటూ ప్రచారాన్ని హోరెత్తించారు. 2016లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 5.36 లక్షల ఓట్లతో మొత్తం ఓట్లలో 16.40శాతం పొందగా... తాజాగా వెలువడిన ఫలితాల్లో 6.30లక్షల ఓట్లతో 18.76శాతం ఓట్లను సాధించింది. హైదరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలోని 43 డివిజన్లలో 33 డివిజన్లు గెలుచుకుని మజ్లిస్‌ ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది.

ముగ్గురూ విజయం సాధించారు

ఈ సారి కార్వాన్‌ నుంచి కొత్తగా స్వామియాదవ్‌కు, ఫలక్‌నుమా నుంచి తారాబాయికి, పురానాపూల్‌ నుంచి ఎస్‌.రాజ్‌మోహన్‌కు రెండోసారి టిక్కెట్లిచ్చింది. ఈ ముగ్గురిని గెలిపించే బాధ్యతను ఎమ్మెల్యేలు కౌసర్‌, అక్బరుద్దీన్‌, ముంతాజ్‌ఖాన్‌లకు అసదుద్దీన్‌ ఒవైసీ అప్పగించారు. స్వామియాదవ్‌తో పాటు సిట్టింగ్‌ కార్పొరేటర్లు తారాబాయి, రాజ్‌మోహన్‌లు సులువుగా గెలిచారు. ఇక గెలుపొందిన మజ్లిస్‌ అభ్యర్థులు కూడా భారీ మెజార్టీ సాధించారు. పత్తర్‌గట్టి అభ్యర్థి సొహైల్‌ ఖాద్రీ 18,909 ఓట్లు, నానల్‌నగర్‌ అభ్యర్థి నసీరుద్దీన్‌ 18,864 ఓట్ల భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. వీరితోపాటు మరో 12మంది పదివేలకుపైగా మెజార్టీతో గెలుపొందారు.

ఇదీ చూడండి: బల్దియా ఎన్నికల్లో పది ఓట్లు కూడా దక్కని అభ్యర్థులెందరో!

ABOUT THE AUTHOR

...view details