MLA Akbaruddin Letter To CM KCR: రాష్ట్రంలో మసీదుల్లో పనిచేసే ఇమామ్, మౌజామ్‌లకు గత 5 నెలలుగా గౌరవ వేతనం చెల్లించడం లేదని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. బకాయిలను వెంటనే చెల్లించాలని కేసీఆర్‌ను కోరారు. అర్హులైన వాళ్లందరికీ ఆసరా పింఛన్లు మంజూరు చేయాలని తెలిపారు. ఈ మేరకు అక్బరుద్దీన్ సీఎంకు రెండు వేర్వేరు లేఖలు రాశారు. రాష్ట్రంలో పది వేల మంది ఇమామ్‌లు, మౌజామ్లు మసీదుల్లో పనిచేస్తున్నారని.. ప్రభుత్వం ఇచ్చే రూ.5 వేల గౌరవ వేతనమే వాళ్లకు ఆధారమని ఆయన అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం గత జులైలో బడ్జెట్ కేటాయించడంతో వక్ఫ్ బోర్డు అధికారులు చెక్కులు పంపించినా.. ఆర్థికశాఖ నుంచి మాత్రం అనుమతి రావడం లేదని అక్బరుద్దీన్ లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పింఛన్లు సైతం సకాలంలో అందక.. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో 57 ఏళ్ల వయసు దాటిన అర్హులు వృద్ధాప్య పింఛన్‌కు దరఖాస్తు చేసున్నారని చెప్పారు. కానీ వారికి గుర్తింపు పత్రాలు ఇచ్చినప్పటికీ.. పింఛన్ మాత్రం ఇవ్వడం లేదని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అర్హులందరికీ కొత్తగా పింఛన్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని అక్బరుద్దీన్ కోరారు.