MIM and Congress demand that Rajasingh be expelled : ఎమ్మెల్యే రాజాసింగ్ అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పాతబస్తీలో నిరసనలు కొనసాగాయి. శాలీబండ్ రోడ్ వద్ద ఆందోళన చేపట్టారు. రోడ్లపైకి పెద్దసంఖ్యలో జనం రావడంతో... పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఎంఐఎం పత్తర్‌గట్టి కార్పొరేటర్ సహా పలువురిని అరెస్ట్ చేశారు. ఆందోళనల దృష్ట్యా ... పోలీసులు పాతబస్తీలో అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేక బలగాలను మోహరించారు.
ఎమ్మెల్యే రాజాసింగ్‌ను శాసనసభ నుంచి బహిష్కరించాలని సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ఎంఐఎం లేఖ రాసింది. పదేపదే తన చర్యలతో రాజాసింగ్.. శాసనసభ్యునిగా అర్హత కోల్పోతున్నారని మజ్లిస్ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషాఖాద్రీ లేఖలో పేర్కొన్నారు. గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సహా పత్రికా కథనాలను ఉటంకించారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల నుంచి కూడా రాజాసింగ్ సస్పెండ్ అయినట్లు గుర్తుచేశారు. శాసనసభ్యుడిగా చేసిన ప్రమాణానికి విరుద్ధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని... రాజ్యాంగంలోని 194వ ఆర్టికల్ ప్రకారం అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని కోరారు. సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సరైన నిర్ణయం తీసుకుంటారని మజ్లిస్ అధినేత అసుదుద్దీన్ ఓవైసీ ఆశాభావం వ్యక్తం చేశారు.