తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​లో మజ్లిస్ ఏకఛత్రాధిపత్యం - asaduddin owaisi

పాతబస్తీ ఎంఐఎం పార్టీకి కంచుకోట. హైదరాబాద్​ లోక్​సభ స్థానంలో ఓవైసీ కుటుంబానిదే ఆధిపత్యం. సలావుద్దీన్ నుంచి అసదుద్దీన్ వరకు విజయ పరంపరం కొనసాగుతోంది. నాల్గోసారి 'పతంగి' ఎగురవేసి ఏకఛత్రాధిపత్యాన్ని చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. సమయానుకూలంగా కొత్త మిత్రులను ఎంచుకుంది.

హైదరాబాద్ పార్లమెంటు పై ఎంఐఎం జెండా

By

Published : Mar 20, 2019, 1:35 PM IST

హైదరాబాద్ పార్లమెంటు పై ఎంఐఎం జెండా


హైదరాబాద్ ఓవైసీ ఆధిపత్యం
హైదరాబాద్ పాతనగరంలో ఆల్ ఇండియా ఇతైహదుల్ ముస్లిమీన్ గత కొన్నేళ్లుగా తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరుస్తోంది. హైదరాబాద్ లోక్​సభ స్థానంలో 1984 నుంచి ఓవైసీ కుటుంబమే గెలుస్తోంది. సలావుద్దీన్ ఓవైసీ 1984లో స్వతంత్ర అభ్యర్థిగా, 1989 నుంచి 1999 వరకు ఎంఐఎం తరుఫున వరుసగా ఐదుసార్లు గెలిచారు. ఆయన వారసుడిగా అరంగేట్రం చేసిన అసదుద్దీన్ 2004 నుంచి విజయపరంపర కొనసాగిస్తున్నారు. ఎక్కువగా ముస్లిం ఓట్లు ఉండటంతో హైదరాబాద్​ను కంచుకోటగా మార్చుకుంది. ఈసారి తెరాసతో చెట్టాపట్టాలేసుకుని మరోసారి పతంగ్​ ఎగరేస్తామని ధీమాతో ఉంది.

కాంగ్రెస్​తో కటీఫ్..తెరాసతో దోస్తీ
గతంలో కాంగ్రెస్​తో దోస్తీ చేసిన ఎంఐఎం..తెలంగాణ ఏర్పడిన తర్వాత తెరాసతో జతకట్టింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఈ రెండుపార్టీలు స్నేహపూర్వక పోటీనే చేశాయి. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లోనూ... పట్టున్న ఏడు స్థానాలతోపాటు రాజేంద్రనగర్​లో మాత్రమే అభ్యర్థిని నిలిపి మిగతా చోట్ల కారుకే మద్దతిచ్చింది మజ్లిస్ పార్టీ.
లోక్​సభ ఎన్నికల్లోనూ అదే మైత్రిని కొనసాగిస్తూ... 16 చోట్ల తెరాస, హైదరాబాద్​లో ఎంఐఎం పోటీ చేయబోతున్నాయి. తెరాసకు 16, మజ్లిస్​కు ఒక స్థానం అంటూ ఇరుపార్టీల నేతలు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు.

ఫెడరల్​ ఫ్రంట్​కు జై కొట్టిన అసద్
ముఖ్యమంత్రి కేసీఆర్ సమాఖ్య కూటమి వాదాన్ని కూడా మజ్లిస్ ఎత్తుకొంది. కాంగ్రెస్, భాజపాలకు ప్రత్యామ్నాయంగా దేశరాజకీయాల్లో రావాల్సిన అవసరం ఉందని అంటోంది. ఇతర రాష్ట్రాల్లోనూ మజ్లిస్ అభ్యర్థులు పోటీకి దిగే అవకాశం ఉంది. బీహార్ లోని కిషన్ గంజ్ నియోజవర్గానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అక్తరుల్ ఇమాన్ ను అభ్యర్థిగా కూడా ప్రకటించింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్, ఉత్తర ప్రదేశ్ లోనూ మజ్లిస్ అభ్యర్థులు పోటీ చేసే అవకాశం ఉంది.

ఆంధ్రాకు వెళ్తామని ప్రకటన
ఆంధ్రా రాజకీయాల్లో అడుగు పెడతామని ఇటీవల అసదుద్దీన్ ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి కోరితే వైకాపాకు మద్దతుగా ప్రచారం చేసేందుకు సిద్ధమేనని ఆఫర్ ఇచ్చారు. తెలంగాణలో మాదిరిగా అటు ఆంధ్రాలో దోస్తాన్ చేసేందుకు ఎంఐఎం ఉవ్విళ్లూరుతోంది.

ABOUT THE AUTHOR

...view details