Millet Marvel Restaurant at Shamshabad Airport : జాతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ న్యూట్రీ హబ్ సహకారంతో "మిల్లెట్ మార్వెల్స్ అంకుర సంస్థ" ఆధ్వర్యంలో హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎక్స్‌క్లూజివ్ మిల్లెట్ రెస్టారెంట్ ప్రారంభమైంది. దీనికి ఎయిర్‌పోర్టు, అపోలో హాస్పిటల్స్ యాజమాన్యాలు కూడా తన వంతు సహకారం అందిస్తున్నాయి. విమానయానం సాగించే పాన్ ఇండియా సహా.. విదేశీ ప్రయాణికులను విశేషంగా ఆకర్షించేందుకు ఈ మిల్లెట్ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. త్వరలో దిల్లీ, చెన్నై విమానాశ్రయాల్లో.. ఆ తర్వాత దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లోనూ ఇలాంటి రెస్టారెంట్లను ప్రారంభించనున్నామని మిల్లెట్ మార్వెల్స్ అధిపతి, ప్రముఖ నటుడు డాక్టర్ భరత్‌రెడ్డి అన్నారు.
'బెస్ట్ స్టార్టప్' అవార్డు.. ఎయిర్‌పోర్ట్ ప్రాంగణంలో ఏర్పాటైన ఈ మిల్లెట్ రెస్టారెంట్ 150 చదరపు అడుగుల సర్వీస్ ఏరియాతో, ఒకేసారి 300 మందికి భోజన సదుపాయం కల్పించే సామర్థ్యం కలిగి ఉంది. ఈ కామర్స్, సూపర్ మార్కెట్లు, ఫుడ్ డెలివరీ సంస్థల ద్వారానూ.. వినియోగదారులకు సేవలను అందిస్తుంది. మిల్లెట్ మార్వెల్స్ సంస్థకు కేంద్రం 'బెస్ట్ స్టార్టప్' అవార్డును సైతం అందజేసింది.
ఇక్కడ మిల్లెట్స్‌తో తయారు చేసే ఇడ్లీ, వడ, దోశ, షెజ్వాన్ పిజ్జా, ఊతప్పం, పొంగల్, ఉప్మా, పూరీ, ఆలూ పరాటా సహా... పలు ఆహార పదార్థాలు అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఐదేళ్లల్లో 400 చిరుధాన్యాల అంకుర కేంద్రాలు, వ్యాపార సంస్థలకు శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని ఐఐఎమ్ఆర్ న్యూట్రీహబ్ సీఈవో డాక్టర్ దయాకర్‌రావు తెలిపారు.