తెలంగాణ

telangana

ETV Bharat / state

వలస వచ్చారు.. వరస కట్టారు! - ప్రత్యేక రైళ్లు

నగరానికి పనికోసం సుమారు 15 రాష్ట్రాల నుంచి వచ్చిన వారందరికీ అండగా ఉంటామని నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పేర్కొన్నారు. నెలాఖరు వరకు తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని ఆయన వివరించారు.

GHMC MAYOR RAMMOHAN  LATEST NEWS
GHMC MAYOR RAMMOHAN LATEST NEWS

By

Published : May 9, 2020, 8:01 AM IST

కొవిడ్‌-19 విపత్కర పరిస్థితుల్లో ఇక్కడ చిక్కుకున్న వలస కార్మికులను స్వరాష్ట్రాలకు తరలించేందుకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసిన తొలిరాష్ట్రం తెలంగాణ అని హైదరబాద్​ నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అన్నారు. రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌తో కలిసి రాయదుర్గంలో ఉన్న మైంహోమ్‌ హబ్‌లో పనిచేస్తున్న వలస కార్మికులతో ఆయన మాట్లాడారు. ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసి కార్మికులను స్వస్థలాలకు పంపేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.4 కోట్ల నిధులను కేంద్రానికి చెల్లించిందన్నారు.

ఒకేసారి ఎక్కువ రైళ్లు పంపేందుకు సిద్ధంగా ఉన్నామని, కాకపోతే ఆయా రాష్ట్రాల్లో స్క్రీనింగ్‌కు ఇబ్బందిగా మారుతుందనే దశలవారీగా పంపుతున్నట్లు తెలిపారు. వలస కార్మికులను పంపేందుకు నిర్మాణ ప్రదేశాల్లోనే వివరాలు నమోదు చేసుకునే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో 288 పని ప్రదేశాల్లో వలస కార్మికులకు క్యాంపులు ఏర్పాటు చేసి భోజనం, వసతి ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

అందర్నీ పంపుతాం...

తెలంగాణ నుంచి ఇప్పటివరకు 16 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి సొంత రాష్ట్రాలకు వలస కార్మికులను పంపినట్లు రాష్ట్ర పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ తెలిపారు. నిబంధనల మేరకు ప్రతి రైలులో 1200 మంది చొప్పున రోజుకు 6 వేల మందిని మాత్రమే తరలించేందుకు అవకాశం ఉన్నందున.. వరస క్రమంలో నమోదు చేసుకున్నవారి పరంగా అందరినీ పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.

కేంద్ర ప్రభుత్వం కల్పించిన వెసులుబాటుతో పనులన్నీ మొదలయ్యాయని.. సొంత రాష్ట్రాలకు వెళ్లే అవకాశం వచ్చేవరకు ఇక్కడ పనుల్లో నిమగ్నం కావాలని ఆయన సూచించారు. వలస కార్మికులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించి, జీతాలు ఇచ్చేందుకు క్రెడాయ్‌, బిల్డర్స్‌ అసోసియేషన్‌, కాంట్రాక్టర్లతో మంత్రి కేటీఆర్‌ ఐదుసార్లు ప్రత్యేకంగా చర్చించినట్లు ఆయన తెలిపారు.

అభివృద్ధి పనుల పరిశీలన...

నగరంలో పలు అభివృద్ధి పనులను పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, ఇతర అధికారులతో కలిసి మేయర్‌ రామ్మోహన్‌ పరిశీలించారు. రూ.23 కోట్లతో నిర్మిస్తున్న పంజాగుట్ట ఫ్లైఓవర్‌ పనులను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. శ్మశానవాటిక వైపు రోడ్ల విస్తరణ పనులను పర్యవేక్షించారు. లెదర్‌ పార్కు నుంచి రోడ్డు నెంబరు 45 వరకు, ప్రశాసన్‌ నగర్‌లో నిర్మిస్తున్న రోడ్లను పరిశీలించారు.

ABOUT THE AUTHOR

...view details