తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉపాధి లేక.. ఇంట్లో ఉండనీయక: కట్టుబట్టలతో ఫ్లైఓవర్‌ కిందే జీవనం

కరోనా మహమ్మారి పేదల బతుకుల్ని మరింత ఛిద్రం చేస్తోంది. లాక్​డౌన్​తో ఉపాధి కోల్పోయి.. తిండి లేక కూలీలు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. ఒకపూట భోజనం దొరకని వలస కార్మికులెందరో దీనంగా దాతల వైపు చూస్తున్నారు. వారు అందించే పట్టెడన్నం కోసం పడిగాపులు కాస్తున్నారు. దొరికిన ఒక్క పొట్లంతోనే కుటుంబమంతా సర్దుకుంటూ దీనంగా రోజులు వెళ్లదీస్తున్నారు.

రోడ్లపైనే జీవనం వెళ్లదీస్తున్న వలస కార్మికులు
రోడ్లపైనే జీవనం వెళ్లదీస్తున్న వలస కార్మికులు

By

Published : May 20, 2021, 10:06 AM IST

దిల్లీ నుంచి ఎన్నో ఏళ్ల కిందట బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చిన బసంత్‌సింగ్‌ కుటుంబం మన్సూరాబాద్‌లో నివాసం ఉండేది. అతను తాపీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. కరోనా కారణంగా పనుల్లేకపోవడంతో ఉపాధి లభించక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. అద్దె కట్టలేకపోవడంతో యజమాని ఇల్లు ఖాళీ చేయించాడు. అద్దె కింద ఇంట్లోని సామగ్రిని తీసుకుని ఆ కుటుంబాన్ని బయటకు పంపించేశాడు. కట్టుబట్టలతో నడిరోడ్డున పడి.. దిక్కుతోచని స్థితిలో భార్య, పది నెలల బిడ్డతో ఎల్బీనగర్‌ సమీపంలోని కామినేని ఆసుపత్రి వద్ద పైవంతెన కింద తలదాచుకుంటున్న పరిస్థితి.

అక్కడే చాప వేసుకుని బట్టలను తలగడగా పెట్టుకుని నిద్రిస్తున్నారు. వారం రోజులుగా దాతలు పెట్టే ఆహారంతో ఆ కుటుంబం కడుపునింపుకొంటోంది. ప్రస్తుతం బసంత్‌సింగ్‌ భార్యకు జ్వరం రావడంతో మందులు కొనేందుకు డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నాడు. బుధవారం వారి దీనస్థితిని ‘ఈనాడు’ గమనించి ఎల్బీనగర్‌ జోనల్‌ కమిషనర్‌ ఉపేందర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లింది. పునరావాస కేంద్రానికి తీసుకెళ్లి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బసంత్‌సింగ్‌ భార్యకు జ్వరం ఉన్నందున కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తామని, అవసరమైతే ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలిస్తామన్నారు.

ఇదీ చూడండి: కరోనాకు చిక్కొద్దని వ్యవసాయ క్షేత్రాల్లోకి మకాం మారుస్తున్న ధనవంతులు

ABOUT THE AUTHOR

...view details