తినడానికి తిండి లేదు..ఉపాధి కరువైంది. బతుకు భారమైంది. దయచేసి మమ్మల్ని స్వస్థలాలకు పంపాలంటూ వలస కూలీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు.
'పోలవరం’ కూలీల పయనం.. అడ్డగింత
పోలవరం ప్రాజెక్టు పనులకోసం బిహార్, ఝార్ఖండ్, దిల్లీ, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి కూలీలు వలసవచ్చారు. లాక్‌డౌన్‌తో కొంతకాలంగా కుటుంబ సభ్యులకు దూరంగా ఇక్కడే ఉండిపోయారు. ఊరువెళ్లాలని సోమవారం అర్ధరాత్రి బయలుదేరిన సుమారు 600 మంది దేవీపట్నం సమీపానికి వచ్చారు. పోలీసులు వారిని వెనక్కి పంపించేశారు. వారు వెనుదిరగలేదు. మంగళవారం తెల్లవారుజాముకంతా పురుషోత్తపట్నం మీదుగా బృందాలుగా 18 కిలోమీటర్ల మేర కాలినడకన సీతానగరం వద్దకు చేరారు. పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం ఏటిగట్టు, బస్టాండుల వద్ద వారిని నిలిపివేశారు. అప్పటికే కొందరు రాజమహేంద్రవరం వెళ్లడంతో అర్బన్ జిల్లా పోలీసులను అప్రమత్తం చేశారు. అధికారులు అక్కడికొచ్చి కూలీలు ముందుకు వెళ్లకుండా ఆపేశారు. అనంతరం వారిని ఇసుక లారీల్లో ఎక్కాలని చెప్పడంతో.. తమను మళ్లీ పోలవరం ప్రాజెక్టు పనుల వద్దకు పంపించవద్దని, సొంత రాష్ట్రాలకు వెళ్లిపోతామంటూ పోలీసులను ప్రాధేయపడ్డారు. ఉన్నతాధికారుల సూచనలతో వీరిని రాజమహేంద్రవరం గ్రామీణంలోని కాతేరు వద్దనున్న ఓ కల్యాణ మండపానికి తరలించారు.
కార్మికుల ఆందోళన
గుంటూరు జిల్లా మంగళగిరిలోని అఖిలభారత వైద్యవిజ్ఞాన శాస్త్రాల సంస్థ (ఎయిమ్స్) నిర్మాణ పనులకు వచ్చిన వివిధ రాష్ట్రాల కార్మికులు మంగళవారం ఆందోళనకు దిగారు. తమను స్వస్థలాలకు పంపాలని, వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. నిర్మాణసంస్థకు చెందిన కార్యాలయంపై వారు దాడికి ప్రయత్నించగా సమాచారం తెలుసుకున్న అధికారులు అక్కడకు చేరుకున్నారు. 3 రోజుల్లో స్వస్థలాలకు పంపుతామని అధికారులు హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.