Michaung Cyclone Affect in Telangana : మిగ్ జాం తుపాను తీవ్రతతో హైదరాబాద్‌లో నిన్నటి నుంచి ఒక్కసారిగా వాతావరణం చల్లపడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేని వానతో నగరవాసులు తడిసి ముద్దయ్యారు. బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్, లిబర్టీ, హిమాయత్ నగర్, లక్డీకాపుల్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో రహదారులపై నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయమవడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, వర్షాల దృష్ట్యా పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
తెలంగాణపై మిగ్‌జాం తుపాన్ ఎఫెక్ట్ - అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు
Michaung Cyclone Affect on Crops of Telangana : జిల్లాల్లోనూ మిగ్‌జాం తుపాను ప్రభావం చూపింది. ఖమ్మం జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని దమ్మపేట, వేంసూరు, ఎర్రుపాలెం, మధిర, బోనకల్లు, సత్తుపల్లి, కల్లూరు తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పాలేరు నియోజకవర్గం వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షానికి వరి, పత్తి పంటలకి తీవ్ర నష్టం వాటిల్లింది. రోడ్లపై ఆరబోసిన వరి ధాన్యం పూర్తిగా తడిసి పోయింది. ప్రభుత్వమే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు కోరారు. ఎడతెరిపి లేని వర్షాలతో ఖమ్మం జిల్లాలో పాఠశాలలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు.