జాతీయ ఉపాధి హామీ పథకం పనులను వివిధ శాఖలోని అభివృద్ధి పనులతో రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానించింది. తద్వారా పేదలకు ఉపాధితో పాటు ఆ పనులు భవిష్యత్తులో ఉపయోగపడతాయన్నది ఆలోచన. గతేడాది వేసవిలో ఈ తరహా పనులు ప్రారంభించారు. ఆలస్యంగా ప్రణాళిక ఖరారు చేయడంతో కొంత మేర పనులు జరిగాయి. ఈ ఏడాది కూడా వీలైనంత ఎక్కువగా ఉపాధి హామీని ఉపయోగించుకొని వివిధ అభివృద్ధి పనులు చేపట్టేలా ప్రణాళికలు రూపొందించింది. ఒక్క నీటిపారుదల శాఖలోనే ఈ ఏడాది ఉపాధి హామీ ద్వారా రూ. 1600 కోట్ల విలువైన పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
తీవ్రంగా కరోనా ప్రభావం
వివిధ ప్రాజెక్టుల కింద కాల్వలు, డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్‌లకు మరమ్మతులు, పూడికతీత, జంగల్ క్లియరెన్స్, చెరువులకు సంబంధించిన మరమ్మతులు ఇందులో ఉన్నాయి. దేవాదుల, ఎస్సారెస్పీ, పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులకు సంబంధించిన కాల్వలు, డిస్ట్రిబ్యూటరీల పనులు చేపట్టారు. నీటిపారుదల శాఖలో 19 డివిజన్లు ఉండగా ప్రతి డివిజన్లో కనీసం 100 కోట్ల రూపాయల విలువైన పనులు చేపట్టాలని భావించారు. అందుకు అనుగుణంగా ఆయా ప్రాజెక్టులు, చెరువుల కింద మరమ్మతులు, ఇతర పనులను చేపట్టారు. అయితే కరోనా రెండో వేవ్ ప్రభావం ఈ పనులపై బాగా పడింది.
10 శాతమైనా కాలేదు
పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ కొవిడ్ పాజిటివ్ కేసులు భారీగా నమోదయ్యాయి. కొన్ని చోట్ల మరణాలు కూడా చోటు చేసుకున్నాయి. దీంతో ఉపాధి హామీ పనులు అనుకున్నంతగా ముందుకు సాగడం లేదు. కొన్ని గ్రామాల్లో సెల్ఫ్ లాక్డౌన్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు పనులకు రావడం లేదు. దీంతో నీటిపారుదల శాఖ ఉపాధి హామీలో భాగంగా చేపట్టిన పనులు ఆశించిన రీతిలో ముందుకు సాగడం లేదు. 1600 కోట్ల రూపాయల విలువైన పనులకు ప్రణాళిక రూపొందించినప్పటికీ కనీసం అందులో సగం పనులైనా పూర్తి చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ ఇప్పటి వరకు దాదాపుగా 100 కోట్ల రూపాయల విలువైన పనులు మాత్రమే జరిగినట్లు అంచనా వేస్తున్నారు.
స్వయం పర్యవేక్షణ
నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సర్కిళ్ల వారీగా పర్యవేక్షిస్తున్నారు. పనులు అసలు ప్రారంభం కాని, అత్యంత స్వల్పంగా పనులు జరిగిన ఏడుగురు సూపరింటెండెంట్ ఇంజినీర్లకు నీటిపారుదల శాఖ షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. మరమ్మతులు, సంబంధిత పనులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని క్షేత్రస్థాయి ఇంజినీర్లకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. అన్ని చోట్లా పనులు ఊపందుకుంటున్నాయని... వీలైనంత ఎక్కువ మొత్తం పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామని నీటిపారుదలశాఖ వర్గాలు అంటున్నాయి.
ఇదీ చదవండి:రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌పై లాక్డౌన్ ఎఫెక్ట్