Super Saver Card Offer: హైదరాబాద్ మెట్రో రైలులో సూపర్ సేవర్ ఆఫర్ నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. సెలవు రోజుల్లో అపరిమిత ప్రయాణ అవకాశాలను అందించేందుకు హైదరాబాద్ మెట్రో రైలు ప్రకటించిన సూపర్ సేవర్ ఆఫర్ ఈరోజు నుంచే అందుబాటులోకి వచ్చింది. సెలవు రోజుల్లో రూ.59 రూపాయలతో రోజంతా మెట్రోలో ఎన్నిసార్లైనా ప్రయాణించే వెసులుబాటు కల్పించింది. మెట్రో రైల్ టిక్కెట్ కౌంటర్ల వద్ద సూపర్ సేవర్ కార్డులు అందుబాటులో ఉండనున్నాయి. ఈ కార్డుతో జంట నగరాల్లోని 57 మెట్రో స్టేషన్ల మధ్య ఒక రోజులో ఎన్నిసార్లైనా తిరగవచ్చని తెలిపింది.
ఏడాదిలో మెట్రో ప్రకటించిన 100 సెలవు దినాల్లో మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుంది. మెట్రో ప్రయాణికులు మొదటి సారి 50 రూపాయలతో కార్డును తీసుకోవాల్సి ఉంటుంది. కార్డును రూ.59తో రీఛార్జీ చేసుకుంటే ఆఫర్ ప్రారంభమవుతుంది. ప్రతి ఆదివారం, ప్రతి రెండో, నాలుగో శనివారంతో పాటు ముఖ్య పండగలకు ఈ ఆఫర్ వర్తించనున్నట్లు మెట్రో తెలిపింది. ఉగాది, రంజాన్, మొహర్రం, బోనాలు, ఇండిపెండెన్స్ డే, వినాయక చవితి, కృష్ణాష్టమి, దుర్గాష్టమి, దసరా, దీపావళి, బాక్సింగ్ డే, బోగీ, సంక్రాంతి, శివరాత్రి పండుగలకు ఆఫరు వర్తింస్తుందని తెలిపింది. పూర్తి వివరాలు మెట్రో స్టేషన్, వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.