Metro Ride Autos: మెట్రో ఫేజ్ 2 నిర్మాణంపై దృష్టి సారించినట్లు మైట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. ఇందుకోసం మెట్రో ఫేజ్ 2 కింద శంషాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో నిర్మాణానికి రూ. 5 వేల కోట్ల వ్యయంతో ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని ఎండీ స్పష్టం చేశారు. మెట్రో రైల్‌లో ప్రయాణం చేసి మెట్రో స్టేషన్ నుంచి గమ్యస్థానానికి చేరేలా ఎలక్ట్రిక్ ఆటోలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇందులో భాగంగా పెరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ వద్ద మెట్రో రైడ్ ఎలక్ట్రిక్ ఆటోలను ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రారంభించారు.
మెట్రో ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు మెట్రో రైడ్ పేరుతో ఎలక్ట్రిక్ ఆటోలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఎండీ తెలిపారు. ప్రైవేటు వాహనాలతో పోల్చుకుంటే మెట్రో రైడ్ ఆటోలో ఛార్జీ చాలా తక్కువగా ఉంటుందని చెప్పారు. మెట్రో ఫేజ్ 2 లో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని... ఈ ప్రాజెక్టులో భాగస్వాములయ్యేందుకు ఎవరైనా ముందుకు రావొచ్చని పేర్కొన్నారు. కరోనాతో హైదరాబాద్ మెట్రో రైల్ తీవ్రంగా నష్టపోయిందని ఆయన ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్ మెట్రో ద్వారా రూ. 3 వేల కోట్ల నష్టం వచ్చిందని పేర్కొన్నారు. నష్టాలు వస్తున్నా మెట్రోను మధ్యలో వదిలేయకుండా ఎల్అండ్టీ నిర్వహిస్తోందని తెలిపారు.