Telangana Weather Report: ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ రోజు తేలిక పాటి నుంచి గట్టి జల్లులు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆ తరవాత రోజు నుంచి పొడి వాతావారణం ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. గంటకు సుమారు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలుల ప్రభావం ఉంటుందని తెలిపింది. గాలి విచ్చిన్నతి ఈ రోజు విదర్భ నుంచి మరత్వాడ, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఇంటీరియర్ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్లు ఎత్తు వద్ద కొనసాగుతుందని తెలిపింది.
ఈ రోజు వాతావరణం: రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, గంటకు సుమారు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటన ద్వారా తెలియజేసింది. ఆయా జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది.