❤ నా మాటలు, చేతలు నిన్నెంతో బాధించాయని నాకు అర్థమవుతుంది. నువ్వు దూరమయ్యాకే నీ విలువ తెలిసొచ్చింది. గడిచిన విలువైన సమయాన్ని తిరిగి తీసుకురాలేను.. కానీ జరిగిన పొరపాటును సరిదిద్దుకోగలనని భావిస్తున్నా. ప్లీజ్.. ఒక్క ఛాన్స్ ఇవ్వవూ..!!
❤ మనకు సంబంధించిన కొన్ని విషయాల్లో నేను నీకు తగిన ప్రాధాన్యమివ్వలేకపోయా. ఈ విషయం ఆలస్యంగానైనా తెలుసుకోగలిగా. ఇకపై ఇలా జరగకుండా జాగ్రత్తపడతా.
❤ మన ఇద్దరి మధ్య పొరపచ్ఛాలు రావడానికి నువ్వు నా విషయంలో చెప్పే కారణాలన్నీ సరైనవే! నా స్వార్థ బుద్ధితోనే నేను నిన్ను దూరం చేసుకున్నా. నువ్వు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోయేలా చేశా. కానీ, ప్రేమలో స్వార్థం ఉండకూడదని నువ్వు దూరమయ్యాక గానీ తెలుసుకోలేకపోయా. నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయా. ఈ ఒక్కసారికీ నన్ను క్షమించు డియర్!
❤ ఆ రోజు నిన్ను చాలా బాధపెట్టాను. నువ్వు మంచి మాటలు చెబుతున్నా వినిపించుకునే స్థితిలో అప్పుడు నేను లేను. అలా నా ప్రవర్తనతో నిన్ను నేను హర్ట్ చేయాల్సింది కాదు. కానీ నేను చేసిన తప్పుకు ఇప్పుడు క్షమాపణలు కోరుతున్నా.. సారీ!
❤ తప్పు జరిగిన ప్రతీసారి నీవల్లే అన్నట్లు ప్రవర్తించా. అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. నిన్ను బాధపెట్టాలన్నది నా ఉద్దేశం కాదు. కొన్ని సందర్భాల్లో నేనూ తీవ్ర మనోవేదనకు గురయ్యా. ఈ విషయం నీతో చెప్పడానికి ధైర్యం సరిపోలేదు. కానీ, ఇప్పుడు నువ్వు అనుమతిస్తే ప్రతి విషయం నీతో చర్చించడానికి, పొరపాటైతే క్షమాపణ కోరడానికి నేను సిద్ధంగా ఉన్నా.