రాష్ట్రంలో ఇక నుంచి గృహనిర్మాణ శాఖ ఉండబోదు. గృహ నిర్మాణ శాఖను రాష్ట్ర ప్రభుత్వం రహదార్లు, భవనాల శాఖలో విలీనం చేసింది. శాఖలో ఎలాంటి కార్యక్రమాలు లేకపోవడంతో పాటు బలహీనవర్గాల గృహనిర్మాణాన్ని ఇతర శాఖలు చేపడుతున్నందున గృహనిర్మాణ శాఖను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శాఖలోని గృహనిర్మాణ సంస్థ, రాజీవ్ స్వగృహ, దక్కన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఎలాంటి కార్యక్రమాలు లేని నేపథ్యంలో సర్కార్ ఈ నిర్ణయం తీసుకొంది.
గృహ నిర్మాణ శాఖను మరోశాఖలో విలీనం.. ఉత్తర్వులు జారీ!
19:03 January 20
రహదారులు, భవనాల శాఖలో విలీనం చేసిన రాష్ట్ర ప్రభుత్వం
గృహనిర్మాణ శాఖను రహదర్లు, భవనాల శాఖలో విలీనం చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసింది. శాఖలో మిగిలిన అంశాలు, ఉద్యోగులు, సిబ్బంది, ఆస్తులు, అప్పులను ఆర్ అండ్ బీ శాఖకు బదిలీ చేశారు. అందుకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోవాలని గృహనిర్మాణ, ఆర్ అండ్ బీ, సాధారణ పరిపాలనాశాఖలను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు.
మంత్రి ప్రశాంత్‌రెడ్డి సమీక్ష: రహదార్లు - భవనాలు, గృహనిర్మాణ శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రి ప్రశాంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, కార్యదర్శి శ్రీనివాసరాజు, ప్రత్యేక కార్యదర్శి విజయేంద్ర, అధికారులతో సమావేశమైన మంత్రి.. సంబంధిత ప్రతిపాదనలపై చర్చించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేటాయింపులు, వ్యయంతో పాటు 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదనలపై సమావేశంలో చర్చించారు. తగిన మార్పులు, చేర్పులు చేసి ఆర్థికశాఖకు తుది బడ్జెట్ ప్రతిపాదనలు పంపించాలని అధికారులను మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు.
ఇవీ చదవండి: