కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు త్వరితగతంగా అందేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును సర్పంచుల సంఘం విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో సర్పంచుల సంఘం ప్రతినిధులు మంత్రిని కలిశారు. ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ నిధులు సహా.. 15వ ఆర్థికసంఘం బకాయిలను కూడా కేంద్రం విడుదల చేయడం లేదని వారు తెలిపారు.
దీంతో స్థానిక సంస్థల అభివృద్ధి కుంటుపడుతోందని.. చేసిన పనులకు బిల్లులు రాక సర్పంచులు ఇబ్బందులు పడుతున్నారని సంఘం ప్రతినిధులు మంత్రికి తెలియచేశారు. కేంద్రం నుంచి నిధులు వచ్చేలా ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. బిల్లులు రాక సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారనేది అవాస్తవమని రాష్ట్ర సర్పంచుల సంఘం ఉపాధ్యక్షురాలు ఉదయశ్రీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు అన్నీ వచ్చాయని ఆమె పేర్కొన్నారు.