తెలంగాణ

telangana

ETV Bharat / state

చిరంజీవి ఇంట్లో అనురాగ్​ ఠాకూర్​.. ఆ అంశాలపైనే చర్చ - అనురాగ్​ ఠాకూర్​ హైదరాబాద్ పర్యటన

Chiranjeevi meet with Anurag Thakur: కేంద్ర మంత్రి అనురాగ్​ ఠాకూర్​ మెగాస్టార్​ ఇంట్లో సందడి చేశారు. హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్​ కార్యక్రమానికి వచ్చిన మంత్రి.. చిరంజీవి ఆహ్వానం మేరకు ఆయన ఇంట్లో భేటీ అయ్యారు. ఈ భేటీలో చిరుతో పాటు నటుడు అక్కినేని నాగార్జున, నిర్మాత అల్లు అరవింద్​ పాల్గొని భారతీయ సినీ పరిశ్రమ సాధిస్తోన్న పురోగతిపై చర్చించారు.

Anurag Thakur at Chiranjeevi house
Anurag Thakur at Chiranjeevi house

By

Published : Feb 27, 2023, 3:49 PM IST

Chiranjeevi meet with Anurag Thakur: కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్​తో మెగాస్టార్ చిరంజీవి, నటుడు అక్కినేని నాగార్జున మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు. నిన్న ఓ ప్రైవేటు కార్యక్రమానికి హైదరాబాద్ వచ్చిన అనురాగ్ ఠాకూర్​ను చిరంజీవి తన నివాసానికి ఆహ్వానించారు. చిరు ఆహ్వానం మేరకు జూబ్లీహిల్స్​లోని నివాసానికి వెళ్లిన కేంద్ర మంత్రిని చిరంజీవి, నాగార్జునతోపాటు నిర్మాత అల్లు అరవింద్ శాలువాతో సత్కరించారు.

అనంతరం కొద్దిసేపు భారతీయ సినీ పరిశ్రమ సాధిస్తోన్న పురోగతిపై చర్చించినట్లు చిరంజీవి ట్వీట్ చేశారు. గతేడాది అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో చిరంజీవిని "ఇండియన్ ఫిల్మ్ పర్సనాల్టీ ఆఫ్ ది ఇయర్" పురస్కారంతో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సన్మానించిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ హర్షం వ్యక్తం చేశారు.

ఇక సినిమాల విషయానికొస్తే మెగాస్టార్​ చిరంజీవి ‘భోళా శంకర్‌’ సినిమా షూటింగ్​లో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ మూవీలో తమన్నా, కీర్తి సురేష్​ సందడి చేయనున్నారు. మెహర్‌ రమేశ్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు చిరు తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ ఓటీటీలో ఈరోజు విడుదలైంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈ సినిమా డిజిటల్ ప్రేక్షకులను అలరించనుంది.

Anurag Thakur visit to Hyderabad: మరోవైపు హైదరాబాద్​ పర్యటనకు వచ్చిన అనురాగ్​ ఠాకూర్​ తన కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు. ఆదివారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. కేసీఆర్​ ప్రభుత్వంపై పలు ప్రశ్నలు సంధించారు. ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని పలు విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తప్పక గెలుస్తుందని ఆశ భావం వ్యక్తం చేశారు. ఆ పార్టీ నేతలతో మాట్లాడి తాజాగా రాష్ట్రంలో నెలకొంటున్న పరిస్థితులపై ఆరా తీశారు.

ABOUT THE AUTHOR

...view details